Pawan Kalyan: “పదేపదే నేను చేసుకున్న పెళ్లిళ్ల గురించి..ఇచ్చిన విడాకుల గురించి.. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నేను చేసుకున్నది మూడు పెళ్లిళ్లు అయితే నాలుగు పెళ్లిళ్లు అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న అంటున్నాడు. నేను నాలుగు పెళ్లిళ్లు ఎక్కడ చేసుకున్నాను? నేను చేసుకున్నదే మూడు పెళ్లిళ్లు కదా.. అందులో మొదటి ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చాను.. ఇప్పుడు మూడో భార్యతో ఉంటున్నాను. మరి నాలుగో పెళ్లి ఎక్కడ చేసుకున్నాను? బహుశా నా నాలుగో పెళ్ళాం జగన్ కావచ్చు” తాడేపల్లిగూడెంలో జరిగిన జనసేన- టిడిపి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలివి.
బుధవారం నిర్వహించిన ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కార్యకర్తలను ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ విధానాలను, ప్రజలు పడుతున్న కష్టాలను పవన్ కళ్యాణ్ నేరుగా ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును ప్రత్యక్షంగా ఎండగట్టారు. ప్రతి విషయంలోనూ ఎంత స్పష్టంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. తన వ్యక్తిగత జీవితాన్ని అనవసరంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారని.. తాను వారి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేశాడో, ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశాడో తన దగ్గర సమాచారం ఉందని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. 24 సీట్లు అంటే కేవలం సంఖ్య మాత్రమే కాదని.. గాయత్రి మంత్రంలో అక్షరాలు కూడా 24 అని పవన్ కళ్యాణ్ చురుకలు అంటించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నంత సేపు తాడేపల్లిగూడెం సభా ప్రాంగణం ఈలలతో దద్దరిల్లిపోయింది. చాలా రోజుల తర్వాత పవన్ తన పూర్వపు స్థాయిలో ప్రసంగించడంతో జనసేన శ్రేణుల్లో జోష్ నింపింది. తాను టిడిపి తో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి అండగా ఉండాల్సి వచ్చింది, అలా ఉండకుంటే పరిస్థితి ఏమిటి, ఏపీ భవిష్యత్తుపై తనకున్న లక్ష్యం ఏమిటి? ఇలా అన్ని విషయాలను పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.. అన్నింటికంటే ముఖ్యంగా జగన్ తన నాలుగో భార్య అని పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనికి వైసీపీ నాయకులు ఏ విధమైన కౌంటర్ ఇస్తారో వేచి రావాల్సి ఉంది.