Pawan Kalyan responds to Amaravati women : సాక్షి మీడియాపై( Sakshi media) చర్యలకు కూటమి ప్రభుత్వం ఉపక్రమించనుందా? ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న ఆ సెక్షన్ మీడియాపై యాక్షన్ తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు రోజుల కిందట సాక్షి మీడియాలో జరిగిన డిబేట్లో అమరావతి మహిళా రైతులపై ఓ జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఉంటారంటూ సదరు జర్నలిస్టు కామెంట్స్ చేయగా.. డిబేట్ నిర్వహిస్తున్న విశ్లేషకుడు సైతం దానిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇది పెను దుమారానికి దారితీస్తోంది. రాజధాని రైతులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సాక్షి మీడియా ఛానల్ అధినేత భారతీ రెడ్డి, ఆమె భర్త మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సదరు జర్నలిస్టు, విశ్లేషకుడు తో పాటు సాక్షి యాజమాన్యం పై చర్యలు తప్పకుండా ఉంటాయని స్పష్టమవుతోంది.
* పవన్ చర్యలతో వేగంగా..
సాధారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) స్పందించిన తర్వాత చాలా విషయాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెడుతుంది. సర్వసాధారణంగా వస్తున్న ఆనవాయితీ ఇది. కొద్దిరోజుల కిందట సోషల్ మీడియా వికృత చేష్టలకు పాల్పడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వ్యక్తులపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా పవన్ ప్రకటన చేశారో లేదో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు ప్రారంభమయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకున్నారు. చాలామంది నేతలు అప్పుడు అనుచితంగా ప్రవర్తించారు. అటువంటి వారి అరెస్టులు కూడా ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే పవన్ అటువంటి వారి విషయంలో ఉదాసీనత వద్దు అని ప్రకటన చేశారో.. నాటి నుంచి అరెస్టుల పర్వం ప్రారంభం అయింది. ఇప్పుడు అమరావతి మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యల విషయంలో సైతం.. పవన్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం విశేషం.
* స్ట్రాంగ్ వార్నింగ్.. అమరావతి( Amaravathi ) మహిళా రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధ్యులపై సైతం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, విశ్లేషకుడి ముసుగులో కొమ్మినేని శ్రీనివాసరావు దారుణ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర దాగి ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. ఆ మాటలను ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దని పేర్కొన్నారు. సాక్షి మీడియా సైతం ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని.. సదరు వ్యక్తి అభిప్రాయం అంటూ తప్పించుకునేందుకు వీలు లేదని కూడా తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. కనీసం ఈ ఘటన తర్వాత సాక్షి యాజమాన్యం కనీసం ఖండించని విషయాన్ని ప్రస్తావించారు. నీచ భాషతో రాజధాని ప్రాంతాన్ని, అక్కడ నివసిస్తున్న మహిళలను, ఆ ప్రాంత చారిత్రక నేపథ్యాన్ని అవమానకరంగా మాట్లాడడం వెనుక కుట్ర దాగి ఉందని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
* చర్యలు తప్పవా?
అయితే ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించేసరికి చర్యలు తప్పకుండా ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే సదరు జర్నలిస్టు కృష్ణంరాజు ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అయితే అందులో కూడా ఎక్కడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. తాను అమరావతి అని ప్రస్తావించలేదని.. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటూ సంబోధించానని చెబుతున్నారు. పైగా తన మాటల్లో ఎటువంటి తప్పిదాలు లేవని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో.. బాధ్యులపై చర్యలతో పాటు సాక్షి యాజమాన్యం పై సైతం చర్యలకు దిగే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.