Pawan Kalyan: బంగాళా ఖాతంలో గత శనివారం ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలు, ఏపీలోని విజయవాడ వరదలకు అతలాకుతలం అయ్యాయి. బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలో 40 శాతం నగరం నీటమునిగింది. మున్నేరు పొంగడంతో ఖమ్మం పట్టణంతోపాటు జిల్లాలోని రోడ్లు, రైతులు మార్గాలు తెగిపోయాయి. పంటలు కొట్టుకుపోయాయి. జనజీవనం అస్తవ్యస్తం అయింది. రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించింది. ఇక నీట మునిగిన విజయవాడలో ఇప్పుడిప్పుడే నీరు ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. దీంతో చెత్త, బురదతోపాటు శవాలు పైకి తేలుతున్నాయి. నాలుగు రోజులుగా సరిగా ఆహారం, మంచినీళ్లు, నిద్రలేక ఇబ్బంది పడ్డ ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని కాలనీల ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. శిబిరాల్లో ఉన్నవారు ఇప్పుడిప్పుడే ఇళ్లకు వెళ్తున్నారు. మరోవైపు నేతలు, అధికారులు, సహాయక సిబ్బంది ప్రజలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే వరుసగా నాలుగు రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా గురువారం(సెప్టెంబర్ 5న) వరద ప్రభావిత విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఆకివీడుకు చెందిన ఓ వృద్ధురాలు ఉప ముఖ్యమంత్రిని వెతుక్కుంటూ ఆయన వద్దకు వచ్చి తమ కష్టాలు వెల్లబోసుకుంది. ఆమె గోడు విన్న జస సైనికుడు వృద్ధురాలిని అక్కున చేరుకున్నారు.
భోజనం పెట్టి.. సమస్యలు తెలుసుకుని..
ఆకివీడుకు చెందిన 75ఏళ్ల వృద్ధురాలు కంకణాల కృష్ణవేణికి తన కుటుంబ కష్టాలు చెప్పుకొనేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ను వెతుక్కుంటూ విజయవాడ వచ్చింది. మధ్యాహ్నం çపంచాయతీరాజ్ కమిషనరేట్‌కు వస్తున్నారని తెలుసుకుని గేటు బయట కూర్చోంది. సమావేశం ముగించుకొని వెళ్తుంటే తన బాధ చెప్పుకోవాలని ముందుకు వచ్చిన ఆ వృద్ధురాలి పరిస్థితి చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆ పెద్దామె ఎప్పుడు తిన్నాదో ఏమో అని.. తన సిబ్బంది వాహనంలోకి ఆమెను ఎక్కించి తన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఆమెకు భోజనం పెట్టించి ఆ తరవాత సమస్యలు విన్నారు.
భర్త చనిపోయాడని.. గూడులేదని..
ఆకివీడులోని చేయానగరం ప్రాంతానికి చెందిన కంకణాల కృష్ణవేణి భర్త మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు ముత్తయ్య బొమ్మలు అమ్ముకుంటూ ఇంటిని నెట్టుకొస్తున్నాడు. ఓ రేకుల షెడ్‌లో నివాసం ఉంటున్నారు. ఆమెకు వచ్చే వృద్ధాప్య పింఛన్ మందులకు సరిపోతుంది. ఇంటి స్థలం ఉన్నా, ఇల్లు కట్టుకునే స్థోమత లేదని, కొడుకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇల్లు కట్టించాలని వేడుకుంది. స్పందించిన డిప్యూటీ సీఎం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఈ వృద్ధురాలి బాధలు తెలియచేయాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. కృష్ణవేణిని జాగ్రత్తగా ఆకివీడు ఆమెకు పంపి, కొడుకుకి అప్పగించాలని స్పష్టం చేశారు.
కలెక్టర్ దృష్టికి కృష్ణవేణి సమస్యలు..
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌తో పేషీ అధికారులు మాట్లాడారు. వివరాలు అందించారు. అదే విధంగా కృష్ణవేణిని ప్రత్యేక వాహనంలో ఆకివీడుకు తీసుకెళ్లి ఆమె కుమారుడు ముత్తయ్యకు అప్పగించారు. కలెక్టర్ సీహెచ్.నాగరాణి ఆదేశాలతో గృహ నిర్మాణశాఖ అధికారులు కృష్ణవేణికి ఆకివీడులోని ఉప్పనపూడి లేఅవుట్‌లోని 1896 సర్వే నంబరులో ఉన్న స్థలాన్ని గురువారం ఉదయం పరిశీలించారు. అక్కడ ఇంటి నిర్మాణం నిమిత్తం అవసరమైన నిధులు మంజూరు చేశారు. వెంటనే నిర్మాణం చేపట్టేందుకు కూడా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.