Pawan Kalyan: పవన్ భయపడుతున్నాడా? లేకుంటే పవన్ ను చూసి జగన్ భయపడుతున్నాడా? వైసిపి, జనసేన వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టిడిపి, బిజెపి, జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల అనంతరం బిజెపితో కలిసేందుకు చంద్రబాబు చాలా విధాలుగా ప్రయత్నించారు. కానీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. పవన్ మాత్రం ఎన్డీఏలోకి చేరారు. కానీ బిజెపితో పెద్దగా కలిసి పని చేయలేదు. ఇప్పుడు పవన్ ద్వారా చంద్రబాబు బిజెపికి దగ్గరయ్యారు. బిజెపికి టిడిపి దగ్గర కావడం జగన్ కు ఇష్టం లేదు. జగన్ ఓడించాలని పవన్ తో పాటు చంద్రబాబుకు గట్టి సంకల్పం ఉంది. ఇందుకు చంద్రబాబుకు మంచి సహకారం పవన్ అందిస్తున్నారు. అందుకే పవన్ వేసే ప్రతి అడుగును జగన్ గమనిస్తున్నారని.. పవన్ అంటే భయపడుతున్నారని జనసేన వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అదే సమయంలో జగన్ అంటే పవన్ భయపడుతున్నారని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆ రెండు పార్టీల మధ్య ఆసక్తికరమైన రచ్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
టిడిపి, జనసేన పార్టీలో కీలక నాయకులు పోటీ చేయబోయే నియోజకవర్గాలపై ఫుల్ క్లారిటీ వచ్చింది. చంద్రబాబు కుప్పం నుంచి, లోకేష్ మంగళగిరి నుంచి, బాలకృష్ణ హిందూపురం నుంచి, అచ్చెనాయుడు టెక్కలి నుంచి, నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయడం ఖాయమైంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఇంతవరకు స్పష్టత రావడం లేదు. భీమవరం,పిఠాపురం, గాజువాక,తిరుపతి.. ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఆయనకు భయం పట్టుకుందని వైసిపి వర్గాలు ఆరోపిస్తున్నాయి. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. ఆ రెండు చోట్ల వైసీపీ గత ఎన్నికల్లో పట్టు బిగించింది. అందుకే ఈసారి పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై క్లారిటీ వస్తే వైసిపి ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని.. అందుకే పవన్ ప్రకటించలేకపోతున్నారని వైసిపి సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
అదే సమయంలో జనసేన సోషల్ మీడియా విభాగం వేరే తరహాలో ప్రచారం చేస్తోంది. కూటమితో పవన్ కు తిరుగులేదని.. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమని తేల్చి చెబుతున్నారు. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలు కుమ్మరించడానికి తాడేపల్లి ప్యాలెస్ సిద్ధంగా ఉందని చెప్పుకొస్తున్నారు. పవన్ తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో ప్రకటించకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.సోషల్ మీడియాలో జనసేన నుంచి ఈ తరహా పోస్టులు కనిపిస్తుండడంతో వైసీపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్దవార్ నడుస్తోంది. పవన్ కు భయపడుతున్న జగన్ అంటూ పెడుతున్న పోస్టులకు విశేష స్పందన కనిపిస్తోంది. అదే సమయంలో జగన్ కు భయపడి పవన్ నియోజక వర్గం ప్రకటించడం లేదన్న పోస్టులకు మాత్రం ఓన్లీ వైసీపీ శ్రేణులే స్పందిస్తుండడం విశేషం.