Pawan Kalyan Varahi Yatra: రాజకీయాల్లో మనుషులకే కాదు.. వారు వినియోగించే వాహనాలకు సైతం విపరీతమైన ప్రచారం లభిస్తుంది. నాడు ఎన్టీఆర్ ప్రచార రథం ఇప్పటికీ హైలెట్. నాడు ఆ వాహనంపై నందమూరి తారక రామారావు.. ఊరువాడా ప్రచారం చేశారు. పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అధికారంలోకి రాగలిగారు. అటు తరువాత అంతటి ప్రచారం వారాహి వాహనానికి దక్కింది. పవన్ కళ్యాణ్ వారాహి పేరిట ఏర్పాటుచేసిన ఈ వాహనం ఎన్నెన్నో సంచలనాలకు వేదికగా మారింది. వారాహి వాహనాన్ని అడ్డుకుంటామని కూడా వైసీపీ నేతలు ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఆ వారాహి వాహనం ఏపీలోకి రావడం, దానిపై పవన్ ప్రచారం చేయడం కూడా జరిగిపోయింది. దానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పోయాయి. అయితే ఇటీవల ఆ వాహనం కనిపించకుండా పోయింది. దీంతో రాజకీయ ప్రత్యర్థులు వారాహి వాహనాన్ని ఎప్పుడు తీస్తావ్ అని ప్రశ్నించడం ప్రారంభించారు.
ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో వారాహి పై ప్రచార యాత్రకు పవన్ సిద్ధపడుతున్నారు. ఇటీవల పార్టీ శ్రేణులతో పవన్ సమావేశమయ్యారు. వారాహిని సిద్ధం చేయండి అంటూ పవన్ నాయకులకు ఆదేశించిన వైనం మీడియాలో వచ్చింది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా సెటైర్లు వేస్తోంది. నేతలను వాహనాన్ని సిద్ధం చేయడం అనడం ఏమిటి. డ్రైవర్ కు చెబితే వాహనం బయటకు తీస్తాడు కదా అని సెటైర్లు పడుతున్నాయి. వాటర్ సర్వీసింగ్ చేసి.. ఇంజన్ ఆయిల్ మార్చి.. డీజిల్ కొట్టించాలా ఏంటి అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి జన సైనికులు స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు.
అయితే వారాహి పై ప్రచార యాత్ర కేవలం జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ఉన్నది55 రోజులు.అందులో 20 రోజులు పిఠాపురం నియోజకవర్గానికే పవన్ పరిమితమవుతారని తెలుస్తోంది. అంటే ఒక్క నియోజకవర్గానికి 20 రోజులంటే.. మిగతా జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎన్ని రోజులు ప్రచారం చేస్తారు? కూటమి తరపున ఎన్ని రోజులు ప్రచారం చేస్తారు? భాగస్వామ్య పక్షాల నేతలతో ఎన్ని వేదికలు పంచుకుంటారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ లెక్కన వారాహి వాహనానికి టోటల్ పర్మిట్ అన్నది లేదన్నమాట? లిమిటెడ్ పర్మిట్ మాత్రమే ఉందన్నమాట? అంటూ వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. దీనిపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.