Pawan Kalyan Following BJP: భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) ఎదుగుదలలో అనుబంధ సంఘాల పాత్ర కీలకం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ తో పాటు విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ వంటివి కీలకంగా వ్యవహరిస్తాయి. సంప్రదాయ పార్టీలకు భిన్నంగా ఉంటుంది బిజెపిలో. పార్టీ అంటే బాధ్యత అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అయితే ఇప్పుడు జనసేనలో సైతం అదే సంస్కృతిని ఏర్పాటు చేయాలన్నది పవన్ అభిమతం. పదవులు అంటే దర్పం కాదు.. పదవులు అంటే బాధ్యత అని గుర్తు చేస్తున్నారు పవన్. అందుకే ఈనెల 22న జనసేన ద్వారా పదవులు అందుకున్న వారితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్. ప్రజలకు జవాబుదారీగా నిలవడంతో పాటు పార్టీ విషయంలో చిత్తశుద్ధిగా ఉండాలని సూచించనున్నారు.
* విభిన్న రాజకీయం..
జనసేన ( janasena )ద్వారా పది కాలాలపాటు రాజకీయం చేయాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. అందుకే అధికారం కోసం గట్టిగానే పోరాటం చేశారు. దాదాపు 10 ఏళ్లు పోరాడారు. ఎన్నెన్నో కష్టాలను అధిగమించారు. మరెన్నో అవమానాలు తట్టుకొని పార్టీని నడపగలిగారు. అయితే ఇప్పుడు వచ్చిన అధికారం మూలంగా మరింత బాధ్యతగా వ్యవహరించాలని భావిస్తున్నారు. తాను ఒక్కడినే కాదు.. తన పార్టీ ద్వారా పదవులు అందుకున్న వారంతా అంతే బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నారు. వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశ నిర్దేశం చేయాలనుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బిజెపిని ఫాలో అయినట్టు కనిపిస్తున్నారు.
* అంతా ప్రత్యేకం
బిజెపి నిర్మాణం ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరూ పార్టీని ప్రేమిస్తారు. అందుకు తగ్గట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు. అక్కడ వ్యక్తిగత ఆరాధన ఉంటుంది కానీ.. పార్టీ కంటూ ఒక లైన్ దాటి ఎవరు వ్యవహరించరు. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో బిజెపి సుదీర్ఘకాలం అడుగులు వేసింది. ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకు సాగుతోంది. పరిస్థితులకు అనుగుణంగా బిజెపి ముందడుగు వేస్తోంది. ఆ పార్టీని నమ్మి, ఆ పార్టీ సిద్ధాంతాలతో అడుగులు వేసే క్రమంలో… పటిష్టమైన పార్టీ శ్రేణులతో అదే స్థాయికి చేరుకుంది బిజెపి. ఇప్పుడు కూడా జనసేన విషయంలో అటువంటి వ్యవస్థను కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. పార్టీని నమ్ముకుని పదవులు కోరుకోవడం తప్పులేదు కానీ.. అదే పదవులను బాధ్యతగా నిర్వర్తించి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలి అన్నది పవన్ కళ్యాణ్ సూచన. అందుకే పార్టీ నుంచి పదవులు పొందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారితో పవన్ సమావేశం కానున్నారు. నిజంగా పవన్ గొప్ప విషయాన్ని చెప్పనున్నారన్నమాట.