Pawan Kalyan: విశాఖలో( Visakhapatnam) పెట్టుబడుల సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? బిజీగా ఉన్నారా? రాలేనంత తీరికగా గడుపుతున్నారా? లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. రెండు రోజులుగా విశాఖలో పెట్టుబడుల సదస్సు ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథులుగా నిలిచారు. కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాస వర్మ తో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, కందుల దుర్గేష్ లాంటి వారు హాజరయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. హోదా పరంగా సీఎం చంద్రబాబు తర్వాత స్థానంలో ఉన్నారు. కానీ ఈ సదస్సులో ఆయన కనిపించలేదు. విశాఖ సదస్సు జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ సచివాలయంలోనే సమీక్షలు చేస్తున్నారు. అయితే దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రచారం చేస్తోంది.
* కొద్ది నెలలుగా సన్నాహాలు..
విశాఖ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి చాలా నెలల కిందట నుంచి సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబుతో( CM Chandrababu) పాటు మంత్రి నారా లోకేష్ విదేశాలకు వెళ్లి దిగ్గజ పారిశ్రామికవేత్తలకు స్వయంగా ఆహ్వానాలు అందించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు సైతం ఈ విశాఖ సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం అయ్యారు. రెండు రోజులపాటు విశాఖ వేదికగా జరిగే ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తరువాత ఈ పెట్టుబడుల సదస్సుకు అత్యంత ప్రాధాన్యం పెరిగింది. అయితే విదేశీ సంస్థలు, పరిశ్రమలను ఏపీకి రప్పించడంలో సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ కొంతవరకు సక్సెస్ అయ్యారు. అయితే ఈ కారణం తోనే పవన్ కళ్యాణ్ ఈ సదస్సుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
* జనసేన మంత్రులు యాక్టివ్..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రచారం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఈ సదస్సు పట్ల వ్యతిరేకంగా ఉంటే.. జనసేన కు చెందిన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఎందుకు కీలకంగా వ్యవహరిస్తారు అన్నది ప్రశ్న. నాదెండ్ల మనోహర్ అయితే ప్రారంభ కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ ఏకో సిస్టంపై కీలక ప్రసంగం చేశారు. పారిశ్రామికవేత్తల ప్రాధాన్యతలను వివరించారు. పర్యాటక రంగానికి సంబంధించి ఒప్పందాలను సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ పర్యవేక్షణలో చేశారు. అయితే జనసేన మంత్రులు ఎంతో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ రాకపోవడం మాత్రం కాస్త వెలితిగానే ఉంది.
* బిజీ బిజీగా పవన్..
గత కొద్ది రోజులుగా పాలనతో పాటు పర్యటనలతో బిజీగా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ). మొన్న ఆ మధ్యన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. హెలిక్యాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. స్వయంగా తన సెల్ఫోన్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించిన భూములను ఫోటోలతో పాటు వీడియోలో చిత్రీకరించారు. అదే విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో సహచరులతో చర్చించారు కూడా. విశాఖలో పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సమయంలో సచివాలయంలో ఉండి విస్తృత సమీక్షలు చేస్తున్నారు. తాను నిర్వర్తిస్తున్న పంచాయితీ రాజ్, అటవీ శాఖల విషయంతో పాటు పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పెట్టుబడుల సదస్సుకు పవన్ కళ్యాణ్ రాకపోవడం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న. ఆయన వచ్చి ఉంటే ప్రత్యేక ఆకర్షణగా ఉండేది కదా అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది.
* ఆ క్రెడిట్ విషయంలో..
అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రోటోకాల్ ( protocol) విషయంలో చంద్రబాబు తర్వాత నిలుస్తారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక సదస్సుకు పవన్ కళ్యాణ్ రాకపోవడం వెనుక ఒక కారణం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో సుదీర్ఘకాలం కూటమి కొనసాగాలని పవన్ కళ్యాణ్ బలంగా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు ప్రభుత్వంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉండాలో కూడా వ్యూహం రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో పెట్టుబడుల సదస్సుకు సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ తీవ్రంగా కష్టపడ్డారు. ఈ సదస్సుకు వస్తే తప్పకుండా ఎంతో కొంత క్రెడిట్ పవన్ కళ్యాణ్ కు దక్కి అవకాశం ఉంది. అందుకే వారి కృషి వారికే క్రెడిట్ దక్కాలని పవన్ భావించినట్లు సమాచారం. మరోవైపు యంత్రాంగమంతా విశాఖలో ఉంటే పాలన గాడి తప్పే ప్రమాదం ఉందని భావించి.. పవన్ కళ్యాణ్ అమరావతిలో ఉండి సమన్వయం చేసుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరై వైసీపీ శ్రేణుల్లో ఆనందం నింపారు. కృత్రిమ ఆనందంతో వైసిపి సోషల్ మీడియా గడిపేస్తోంది. అంతకుమించి ఏమీ లేదని జనసేన వర్గాలు తేల్చి చెబుతున్నాయి.