YV Subba Reddy: తిరుమల( Tirumala) లడ్డూ వివాదం కేసులో కీలక ట్విస్ట్. ఈ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి విచారణకు హాజరుకావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అనేక మలుపులు తిరుగుతూ ఈ కేసు పూర్వపు అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి వద్దకు వచ్చి ఆగింది. ఆయన ప్రధాన అనుచరుడు, పీఏగా భావిస్తున్న అప్పన్న అరెస్టుతో మలుపు తిరిగింది. నెయ్యి సరఫరా సంస్థల నుంచి ఆయన ముడుపులు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో పూర్వపు అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి చుట్టూ అనుమానపు చూపులు ప్రారంభం అయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా నోటీసులు ఇవ్వడంతో ఆయన అరెస్టు తప్పదని అంతా టాక్ నడిచింది. ఇటువంటి పరిస్థితుల్లో తాను విచారణకు హాజరు కాలేదని వైవి సుబ్బారెడ్డి తేల్చి చెప్పడం విశేషం.
* అనారోగ్యానికి గురయ్యానని సమాచారం..
వాస్తవానికి ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team) విచారణకు వైవి సుబ్బారెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే తాను అనారోగ్యానికి గురయ్యానని.. విచారణకు హాజరు కాలేనని వైవి సుబ్బారెడ్డి సీట్ కు సమాచారం అందించారు. అవసరం అనుకుంటే మీరే వచ్చి ప్రశ్నించుకోవాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. దీంతో సిట్ అధికారులు ఈనెల 20న హైదరాబాద్కు వెళ్లి ఆయనను ప్రశ్నించనున్నారు. వాస్తవానికి తిరుమల లడ్డు వివాదం వెలుగులోకి వచ్చిన తరువాత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. ఇప్పుడు అదే వైవి సుబ్బారెడ్డి సిబిఐ నేతృత్వంలో ఏర్పాటు అయిన సిట్ విచారణకు హాజరు కాకపోవడం సంచలనంగా మారింది.
* పిఏ లావాదేవీలు వెలుగులోకి
వై వి సుబ్బారెడ్డి( Subba Reddy YV ) పీఏ గా అప్పన్న సుపరిచితులు. బోలె బాబా డైరీ వ్యవహారంలో అప్పన్న హస్తం వెలుగులోకి వచ్చింది. ఆయన ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలను వైవి సుబ్బారెడ్డి జరిపాలన్నది ప్రధాన ఆరోపణ. అయితే కల్తీ అని తెలిసినా.. నెయ్యి సరఫరాను కొనసాగించారని అప్పటి టీటీడీ ఉన్నతాధికారులకు కూడా వాంగ్మూలం ఇచ్చారు. దీంతోనే వైవి సుబ్బారెడ్డి లో ఎక్కువగా కంగారు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణ ఆపేందుకు వైవి సుబ్బారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని కూడా తెలుస్తోంది. సీట్ ఇచ్చే ప్రతి నోటీస్ పైన ఆయన కోర్టులో పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఆయన కంగారు చూస్తుంటే భుజాలు తడుముకుంటున్న తీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదే వైవి సుబ్బారెడ్డి కోరిక మేరకు.. సిబిఐ నేతృత్వంలోని అత్యున్నత దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. అందుకే వైవి సుబ్బారెడ్డి విషయంలో సైతం ప్రత్యేక ఆసక్తితో ఉంది. ఆయన విషయంలో కీలక ఆధారాలు లభ్యమైన వేళ.. కీలక అడుగులు పడే అవకాశం ఉంది.