Ayodhya Ram Mandir – Pawan Kalyan : అయోధ్య ఒక ఏమోషన్.. 500 ఏళ్లుగా తీరని కోరిక.. ఎంతో మంది ఉద్దండ నేతలు,ప్రధానులు, హిందూ సంస్థల బాధ్యులు వచ్చినా హిందువుల కోరిక నెరవేర్చలేదు. 500 ఏళ్ల క్రితం రామ జన్మభూమి అయిన అయోధ్యలో రాముడి దేవాలయం కూల్చి బాబ్రీ మసీదు కట్టిన మొఘల్ సామ్రాజ్యపు పునాధులను పెకలించలేకపోయారు.
కానీ ఆ పనిని ఇప్పుడు మోడీ సర్కార్ చేసి చూపించింది. సుప్రీంకోర్టులో గెలిచి బాబ్రీ మసీదు స్థలాన్ని అయోధ్య రామ మందిరందేనని గెలుచుకుంది. అంతే తడువుగా అయోధ్య ఆలయ ట్రస్టును పెట్టి దేవాలయాన్ని నిర్మించింది. ఈరోజు ప్రాణప్రతిష్టతో యావత్ దేశాన్ని రామసేవలో పులకింపచేసింది.
దేశమంతా రామనామ స్మరణతో మారుమోగుతుంటే.. ఇప్పుడు అయోధ్య రామమందిర శంకుస్థాపనకు స్వయంగా అయోధ్యకు హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింతగా పులకించిపోయారు. ఆలయం గ్యాలరీలో ముందు వరుసలలోనే కూర్చున్న పవన్ కళ్యాణ్ ఈ వేడుక ముగిసిన తర్వాత సెల్ఫీ తీసుకున్నారు. అయోధ్య వైభవాన్ని కళ్లకు కట్టారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కళ్లలో సుడులు తిరుగుతున్నా కన్నీళ్లతో కనిపించారు. ఏమోషనల్ అయ్యారు. తన అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా మీడియా అడగ్గా.. తాను నిజంగానే భావోద్వేగానికి గురయ్యానని బదులిచ్చారు.“ఈ రోజు నాకు వ్యక్తిగతంగా చాలా భావోద్వేగ ప్రయాణం. ప్రాణప్రతిష్ఠ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది భారతదేశాన్ని ఒక దేశంగా బలోపేతం చేసింది. ఏకం చేసింది. నేను నిజంగా భావోద్వేగానికి లోనవుతున్నందున ప్రస్తుతానికి ఇంతకు మించి మాట్లాడలేను ”అని పవన్ తనను ఇంటర్వ్యూ చేసిన ఒక జాతీయ మీడియా సంస్థతో అన్నారు.
పవన్ కళ్యాణ్ అయోధ్య మందిరం ముందు ఆధ్యాత్మిక మూడ్‌లో ఉన్న చిత్రాన్ని కూడా పంచుకున్నారు. భారతీయుల 500 ఏళ్ల కోరిక ఎట్టకేలకు నేడు నెరవేరిందని ఆయన అన్నారు.