Pithapuram: పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ ఫిక్స్ చేశారు. అక్కడి నుంచి పోటీ చేస్తారని స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు పవన్ కు ఢీకొట్టేది ఎవరు? వైసీపీ నుంచి ఎవరు బరిలో దిగుతారు? ఇప్పటికే ప్రకటించిన వంగా గీత దిగుతారా? లేకుంటే ముద్రగడ పద్మనాభం అభ్యర్థిగా మారుతారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. పవన్ ను ఎలాగైనా ఓడించాలని జగన్ చూస్తారు. గట్టి అభ్యర్థిని బరిలోదించాలని భావిస్తారు. అందుకే ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరు? అన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పెండెం దొరబాబు పోటీ చేశారు. త్రిముఖ పోటీలో గెలిచారు. ఈసారి టిడిపి, జనసేనల మధ్య పొత్తు ఉండడం.. నేరుగా పవన్ కళ్యాణ్ పోటీ చేయనుండడంతోఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలే మారిపోనున్నాయి. ఇప్పటివరకు పొత్తులో భాగంగా జనసేన టికెట్ ను తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిల్లా శ్రీధర్ ఆశించారు. టిడిపి నుంచి వర్మ పోటీ చేయాలని భావించారు. అయితే ఇప్పుడు పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో వారు సైలెంట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పవన్ బరిలో నిలవడంతో వైసిపి ఆపరేషన్ ఆకర్ష్ పథకానికి శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టిడిపి, జనసేన లో అసంతృప్త నాయకులకు తమ వైపు తిప్పుకునే ఛాన్స్ ఉంది.
పిఠాపురం నియోజకవర్గం లో కాపు సామాజిక వర్గం అధికం. దాదాపు 91 వేలకు పైగా ఓటర్లు ఆ సామాజిక వర్గం వారు ఉన్నారు. అందులో మెజారిటీ వర్గం పవన్ వెంట నడిచే అవకాశం ఉంది. అయితే ఈ తరుణంలో ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి రప్పించడానికి అదే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇప్పటికే వంగా గీతను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు ఆమెను తప్పించి ముద్రగడను బరిలో దించుతారని తెలుస్తోంది. ఆయన కాకుంటే కుమారుడినైనా పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట వంగా గీతను సీఎంవోకి పిలిపించిన జగన్ ఇదే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆమెను కాకినాడ పార్లమెంట్ స్థానం పరిధిలోని వేరే నియోజకవర్గానికి పంపించి.. ఆమె స్థానంలో ముద్రగడ పేరును ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ఒకవేళ ముద్రగడ అయితే మాత్రం గట్టి ఫైట్ ఉండనుంది. ఒకవైపు ఆపరేషన్ ఆకర్స్ ద్వారా టిడిపి, జనసేనల నుంచి భారీగా నాయకులను వైసీపీలోకి రప్పించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో?