TDP Janasena Alliance: ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. టిడిపి, జనసేన పోటా పోటీగా అభ్యర్థులను ప్రకటిస్తుండడం.. పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. పొత్తుపై ప్రభావం చూపుతున్నాయి. అయితే టిడిపి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నా.. పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. లోలోపల ఏదో అనుమానం మాత్రం ప్రారంభమైంది. ఢిల్లీ డైరెక్షన్ తోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో రెండు పార్టీలలో ఒక రకమైన అభద్రతాభావం కనిపిస్తోంది. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి పెంచుతోంది.
ఈరోజు నుంచి చంద్రబాబు రా కదలిరా అంటూ నిర్వహిస్తున్న సభల్లో పాల్గొనున్నారు.పండుగ తరువాత అయోధ్య రామ మందిరం ప్రతిష్ట వేడుకలకు చంద్రబాబు హాజరయ్యారు. దీంతో ఈ సభలకు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు వరుస పర్యటనలతో చంద్రబాబు బిజీ కానున్నారు. ఈరోజు పీలేరు, ఉరవకొండ నియోజకవర్గాల్లో జరిగే సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. గతంలో మండపేట, అరకులో పర్యటించిన సమయంలో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. ఏకపక్షంగా అభ్యర్థుల ప్రకటించడాన్ని పవన్ తప్పు పట్టారు. పోటీగా రాజానగరం, రాజోలు నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత పొత్తు ధర్మం పాటించడం లేదని చంద్రబాబుపై పరోక్షంగా వ్యాఖ్యానించారు.
అయితే ఇదే అదునుగా రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడిందని… పొత్తులపై ప్రభావం చూపనుందని రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో లేనిపోని ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో టిడిపి అలెర్ట్ అయ్యింది. పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు టిడిపి నేతలు చెబుతున్నారు. పవన్ ఆ రెండు సీట్లు ప్రకటించడం వల్ల తమకు నష్టం లేదని.. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారని టిడిపి నేతలు చెబుతున్నారు. మరోవైపు రాజోలు, రాజానగరం టిడిపి నాయకులుపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడుతో సమావేశం కావడం గమనార్హం.
అయితే పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించే అవకాశం ఉంది. రా కదలిరా సభల్లో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. తాను అభ్యర్థులను ఎందుకు ప్రకటించింది. పవన్ ఎందుకు స్పందించాల్సి వచ్చింది. ఇందులో ప్రతిపక్షాల కుట్ర. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. వంటి వాటిపై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో సైతం రెండు పార్టీలు అనుసరించే వైఖరి వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తుకు విఘాతం కలిగించే ఈ అంశాల జోలికి వెళ్ళవద్దని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశ నిర్దేశం చేసే పరిస్థితి ఉంది.