Pawan Kalyan : గత కొద్దీ రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం లోని ఉప్పాడ ప్రాంతంలో మత్స్యకారులు సముద్రపు నీరు ఫ్యాక్టరీల కారణంగా కలుషితం అవుతున్నాయని, చేపలు విషపూరితంగా మారిపోతున్నాయని, దీనిపై స్పష్టమైన విచారణ చేపట్టి, చర్యలు తీసుకోకపోతే మేము అసలు చేపలు పట్టడానికే వెళ్ళమని, పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడాలి అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపిన వీడియోలను మనమంతా చూసాము. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే సమీక్ష నిర్వహించి, నేడు కాకినాడ జిల్లాలో పర్యటించి, ఉప్పాడ లో బహిరంగ సభని ఏర్పాటు చేసి అక్కడి మత్స్యకారులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడంటే, చేసి తీరుతాడు అంతే అంటూ ఈ వీడియోలను చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.
ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు ఉదయం కాకినాడ కలెక్టర్ గారితో ఈ సమస్య గురించి మాట్లాడాను. దాదాపుగా వంద మంది యువకుల నుండి ఏమి జరుగుతుందో తెలుసుకున్నాను. ఇది ఒక్క రోజులో తీరిపోయే సమస్య కాదు, కాబట్టి నాకు ఒక మూడు నెలలు సమయం ఇవ్వండి. దీని పరిష్కార మార్గం వెతుకుతాను, ఒక చక్కటి రూట్ మ్యాప్ తో మీ ముందుకొస్తాను, ఈ విషయం పై క్యాబినెట్ లో చర్చించడమే కాదు, అవసరమైతే అసెంబ్లీ లో కూడా చర్చిస్తాను. కాస్త సమయం ఇవ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఉప్పాడ సముద్ర తీరం చుట్టూ రేటెన్షన్ వాల్ కట్టించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే ఈ వాల్ కోసం 350 కోట్ల రూపాయిలు కేంద్రం నుండి విడుదల అవ్వాలి. ఇప్పటికే రెండు సార్లు దీనిపై చర్చించారు, రేపు మూడవసారి చర్చించబోతున్నారు’.
‘కేంద్రం ఆమోదం అయితే తెలిపింది కానీ, 250 కోట్లు ఇవ్వాలా?, లేకపోతే 350 కోట్లు ఇవ్వాల్సిందేనా అనే విషయం పై మాత్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నేను మన సాధక బాధకాలు మొత్తం చెప్పి, 350 కోట్ల రూపాయిలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేసాను. అతి త్వరలోనే నిధులు విడుదల కాబోతున్నాయి. నేను మిగిలిన రాజకీయ నాయకులూ లాగా రెండు మూడు రోజుల్లో అయిపోతుందని మిమ్మల్ని మభ్యపెట్టే వ్యక్తిని కాదు. ప్రతీ దానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. సమయానుసారం అన్ని పనులు చకచకా జరిగిపోతాయి. అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటాను కానీ, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే ప్రసక్తే లేదు’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. పవన్ వచ్చి మాట ఇవ్వడం తో ఇన్ని రోజులు నిరసన తెలిపిన మత్స్యకారులు ఇప్పుడు శాంతించారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ పనులు ఎంత వరకు ప్రోగ్రెస్ అవుతాయి అనేది.
