Pawan Kalyan: రాజకీయాలు అన్నాక విమర్శలు ఉంటాయి. ప్రతి విమర్శలు సైతం ఉంటాయి. అయితే ఆ విమర్శలు హుందాగా ఉండాలే కానీ… వ్యక్తిత్వ హననానికి దిగేలా ఉండకూడదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై( AP deputy CM Pawan Kalyan ) ఇప్పుడు తెలంగాణ నేతలు అలానే మాట్లాడుతున్నారు. బిఆర్ఎస్ కు చెందిన జగదీశ్వర్ రెడ్డి అయితే శృతిమించి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు బుర్ర లేదంటూ మాట్లాడారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ వ్యాఖ్యానించడం తప్పు అయ్యింది వారి దృష్టిలో. మొన్న మధ్యన పవన్ రాజోలు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప్పునీటితో కొబ్బరి పంట నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ దృష్టికి రైతులకు తీసుకెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో కోనసీమ అందమైన ప్రాంతమని.. అటువంటిది తెలంగాణలో లేకపోవడం అక్కడి ప్రజలు బాధపడుతుంటారని.. వారి దిష్టి తగిలిందేమోనని పవన్ వ్యాఖ్యానించారు. కేవలం సానుకూల దృక్పథంతో చేసిన ఈ వ్యాఖ్య పై తెలంగాణ నేతలు విమర్శల పర్వానికి దిగుతున్నారు.
* తెలంగాణ నుంచి ఒత్తిడి..
అయితే ఇప్పుడు తెలంగాణ( Telangana) నుంచి పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరుగుతోంది అక్కడి నేతల నుంచి. తెలంగాణ విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు పవన్ క్షమాపణలు చెప్పాలన్నది వారి డిమాండ్. అలా అయితే కెసిఆర్ వందలసార్లు క్షమాపణ చెప్పాలి ఏపీ ప్రజలకు. ఆయన ఏపీ నేతలను దూషించారు.. ఏపీ ప్రజలను చాలా చులకన చేసి మాట్లాడారు. కేటీఆర్ కూడా తక్కువ తినలేదు. చాలాసార్లు ఆయన ఏపీతోపాటు ఏపీ ప్రజలపై కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో హైదరాబాద్లో ఆందోళనలు అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు. మరి హరీష్ రావు గురించి చెప్పనవసరం లేదు. ఆంధ్ర నేతలతో పాటు ప్రజలను తిడితేనే సెంటిమెంట్ పండుతుందని భావించిన ఆ ముగ్గురు నేతలతో పాటు ఆ పార్టీ నేతలు ఏపీని ఎంతలా తూలనాడారో తెలియనిది కాదు. ఈ లెక్కన వారు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి?
* ఏపీ నేతల మౌనం
తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఆ పరిస్థితి లేదు. ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ రగిలిస్తేనే తమకు మనుగడ అని అక్కడ రాజకీయ పార్టీల నేతలు గుర్తించారు. కానీ ఏపీ రాష్ట్రానికి చెందిన ఒక డిప్యూటీ సీఎం పైనే తెలంగాణ నేతలు విమర్శలు చేస్తుంటే.. ఏపీ నుంచి ఒక్కరంటే ఒక్క నే త కూడా ఖండించడం లేదు. పవన్ కళ్యాణ్ పై బిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు అక్కడ రాజకీయ ప్రత్యర్థులు. అయినా సరే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. కానీ ఏపీ నుంచి మాత్రం ఆ విమర్శలకు కౌంటర్ లేకుండా పోతోంది. ఇది అత్యంత బాధాకరం కూడా.