Pavan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం మరో 10 సంవత్సరాలు కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలన్నది బలమైన ఆకాంక్ష. ఎన్నికలకు ముందు నుంచి పవన్ ఇదే చెబుతున్నారు. పార్టీ శ్రేణులకు ఈ విషయంలోనే హితబోధ చేస్తున్నారు. మన బలానికి తగ్గట్టే నడుచుకుందామని పార్టీ శ్రేణులకు ఒప్పించారు. పొత్తుతో పాటు సీఎం పదవి షేరింగ్ విషయంలో సైతం వచ్చిన ఒత్తిడిని అధిగమించారు పవన్. కాపు సంఘం ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను సైతం పక్కన పెట్టారు. ఆ షరతులతో ముందుకెళితే.. అది వైసీపీకి ప్రయోజనం చేకూర్చడమేనని వాదించారు. తనకి ఎవ్వరూ సలహాలు ఇవ్వాల్సిన పనిలేదని.. తన వెంట వచ్చేవారే తనవారని.. తనకు ఎవరితో పనిలేదని తేల్చి చెప్పారు. అయితే రాష్ట్ర ప్రజల సైతం కూటమికి సంపూర్ణ విజయం ఇచ్చారు. జనసేనకు అయితే శత శాతం గెలుపును అందించారు. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికలకు ముందు ఏ త్యాగాలు చేశారు.. ఇప్పుడు అదే త్యాగాలను కొనసాగిస్తున్నారు పవన్. దీంతో చంద్రబాబు ట్రాప్ లో పవన్ పడ్డారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 21 స్థానాలకు పరిమితమైన జనసేన.. ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో సైతం బిజెపితో కలుపుకొని 20 శాతానికి పరిమితం కానుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఎల్లో మీడియా కథనాలు రాస్తుండడం విశేషం.ఇది జనసైనికులకు మింగుడు పడని అంశంగా మారింది.
* అసెంబ్లీ సీట్ల కోసం ఒత్తిడి
టిడిపితో పొత్తులో భాగంగా 70 నుంచి 80 అసెంబ్లీ సీట్లు అడగాలని అప్పట్లో జనసైనికుల నుంచి ఒత్తిడి ఎదురైంది. కాపు సంఘాల ప్రతినిధులు కూడా ఇదే డిమాండ్ తెరపైకి తెచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో జనసేనకు అంత బలం లేదని.. కమిటీలు లేవని.. గెలవలేని స్థానాలను తీసుకుంటే అది అంతిమంగా వైసిపికి ప్రయోజనం చేకూరుతుందని పవన్ చెప్పుకొచ్చారు. మనకు తగ్గట్టుగా సీట్లు తీసుకుందామని పార్టీ శ్రేణులకు ఒప్పించారు. 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను మాత్రమే పొత్తులో భాగంగా తీసుకున్నారు.అయితే పార్టీ అధినేత ఆదేశానుసారం జనసైనికులు కూటమి ధర్మాన్ని పాటించారు. కూటమి గెలుపులో కీలక భాగస్వామ్యులు అయ్యారు.
* నామినేటెడ్ పదవుల పంపకాలు
అయితే ఇప్పుడు నామినేటెడ్ పదవుల పంపకాలకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. టీటీడీతో పాటు కీలక నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా కొత్త కథనాలను ప్రచురిస్తోంది. నామినేటెడ్ పదవుల పంపకాల ప్రక్రియ ప్రారంభమైందని.. కూటమిలోని మిగతా రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉంటుందని కథనాలు రాస్తోంది. అయితే బిజెపితో కలుపుకొని జనసేనకు కేవలం 18 నుంచి 20 శాతం మాత్రమే పదవులు కేటాయిస్తారని వార్తలు వస్తుండడంతో జనసైనికులు ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఒక పద్ధతి ప్రకారం ఎల్లో మీడియా ఇటువంటి ప్రచారానికి తెరలేపినట్లు అనుమానిస్తున్నారు.
* ఆ ఫార్ములా అయితే పర్వాలేదు
వాస్తవానికి నామినేటెడ్ పదవుల ఎంపికలో ఒక ఫార్ములా తెరపైకి వచ్చింది.టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నచోట 60 శాతం పదవులుఆ పార్టీకి, 30% జనసేన కు, 10 శాతం బిజెపికి అన్న ప్రతిపాదన వచ్చింది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట పార్టీకి 60 శాతం, 30% టిడిపికి, 10 శాతం బిజెపికి అన్న ప్రచారం జరిగింది. బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నచోట 50 శాతం ఆ పార్టీకి, మిగతా 50 శాతం మిగిలిన రెండు పార్టీలకు పదవులు కేటాయిస్తారని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు కేవలం 20 శాతానికి జనసేన, బిజెపి పరిమితం అవుతాయని చెప్పడంతో.. తెర వెనుక టిడిపి రాజకీయం ప్రారంభించిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను నియంత్రించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని ప్రారంభం అయ్యింది.