Janasena : జనసేనాని పవన్ ప్రస్తుతం ఏపీలో ఉన్నారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో కొత్త భవనం ప్రారంభోత్సవం చేశారు. గురువారం నుంచి కార్యాలయంలో ఉన్నా పెద్దగా అలికిడి లేదు. అటు పార్టీ నేతలకు సైతం అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు కార్యాలయానికి వచ్చినా సందడి సందడిగా ఉండేది. నేతలు, కార్యకర్తలతో కిటకిటలాడేది. రౌండ్ టేబుల్ సమావేశాల హడావుడి నడిచేది. అయితే ఈ సారి పవన్ భేటీల సరళి మారింది. కొన్ని సర్వే సంస్థల ప్రతినిధులతో సమావేశమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు టీడీపీ కీలక నేతలతో రహస్య భేటీలు సాగించినట్టు సమాచారం. జనసేన పోటీచేయబోయే నియోజకవర్గాలపై పవన్ ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా జనసేన స్థితిగతులపై పవన్ సర్వే చేయించుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీతో పొత్తుపై పవన్ చాలా సందర్భాల్లో స్పష్టత ఇచ్చారు. పార్టీ శ్రేణులకు కొన్నిరకాల సంకేతాలు పంపించారు. అయితే తమకు బలం ఉన్న చోట పోటీచేయాలని డిసైడ్ అయ్యారు. అందుకు అనుగుణంగా టీడీపీకి ప్రతిపాదనలు పంపించనున్నారు. అందుకే ముందస్తుగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించినట్టు తెలుస్తోంది. కొన్ని సర్వే సంస్థలకు బాధ్యతలు అప్పగించినట్లుగా వార్తలు వచ్చాయి. ఖచ్చితంగా పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలిచేందుకు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జనసేనకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. తాజాగా సర్వేల్లో వస్తున్న ఫలితాలను బట్టి.. తెలుగుదేశం పార్టీ దగ్గర సీట్ల కోసం ప్రతిపాదనలు పెట్టనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అటు పార్టీ అంతర్గత విషయాలపై సైతం పవన్ ప్రత్యేక దృష్టిపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే పార్టీ శ్రేణులకు పొత్తుల విషయంలో స్పష్టమైన సంకేతాలు పంపారు. కానీ ఇటీవల పార్టీలో కొందరి వ్యవహార శైలిపై ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే పొత్తులు, పోటీ చేసే సీట్ల విషయంలో పార్టీ నేతలతో చర్చించేందుకు పవన్ కల్యాణ్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. పొత్తుల విషయాలను తనకు వదిలేయాలని చెబుతున్నారు. తన నిర్ణయాన్ని శిరసావహించేవారే పార్టీ నేతలని.. వ్యతిరేకించేవారిని పట్టించుకోనని ఆయన చెబుతున్నారు. అవకాశవాద రాజకీయాలు.. పార్టీ నేతలపై స్పష్టత ఉన్న పవన్.. తన పని తాను చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
రెండు రోజుల పర్యటనలో వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని సమాలోచనలకే పవన్ ప్రాధాన్యమిచ్చారు. సర్వే సమగ్ర నివేదిక అందుకొని తదనుగుణంగా అడుగులు వేయనున్నారు. అయితే టీడీపీకి ఇప్పటికే కొన్ని సీట్ల ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. అటు టీడీపీ మహానాడు నిర్వహిస్తుండడంతో అక్కడ కూడా పొత్తులపై చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో సర్వే రిపోర్టులు తెలుసుకున్న పవన్ టీడీపీ ముఖ్యులతో సమావేశమైనట్టు వార్తలు వస్తున్నాయి.కాగా రెండురోజుల పర్యటన ముగించుకొని పవన్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు.