AP Politics : హోంమంత్రి అనిత పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు హీటెక్కిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హోంమంత్రి అనిత వివరణ ఇచ్చినా.. విమర్శలు ఆగడం లేదు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో హోంమంత్రి వంగలపూడి అనిత భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఏపీలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై ఆయన ఘాటుగా స్పందించారు. తాను హోంమంత్రిగా ఉండి ఉంటే చర్యలు మరోలా ఉండేవన్నారు. హోంమంత్రి వైఫల్యంతో వరుస ఘటనలు జరుగుతున్నాయంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. హోంమంత్రి అనిత వాటి గురించి వివరించారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. గురువారం ఏపీ సచివాలయంలో డిప్యూటీ సీఎంతో అనిత సమావేశమయ్యారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చిన్నారులు, మహిళలపై జరిగే నేరాలను సీరియస్‌గా తీసుకోవాలని, బాలికలకు అన్యాయం చేసిన వారిని శిక్షించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారని అనిత వెల్లడించారు. ఎల్లవేళలా ప్రజల కోసమే పనిచేసే తమది ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత సీఎం ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై ఇరువురు చర్చించారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం శ్రమించే ప్రజా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమని నేతలు చర్చించుకున్నారు. తానూ ఫేక్ పోస్టు బాధితురాలునే అంటూ అనిత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో అన్నారు. అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన వివరాలను సైతం సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ చర్చించారు. హోమ్ మంత్రి అనిత, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
తన కుమార్తె కన్నీరు చూసే తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే తానే హోంమంత్రి పదవి సైతం తీసుకుంటానని పవన్ కల్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రాష్ట్రంలో అధికారులపై సైతం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే, అధికారి నిజాయతీతో ఉండాలన్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కలిసే ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఇదంతా చూస్తుంటే అనితను పరిపాలనలో ఆమెను మరింత యాక్టీవ్ చేసేందుకే హెచ్చరికలా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అప్పుడే కూటమిలో పొరపొచ్చాలు వచ్చాయంటూ దెప్పిపొడుస్తున్నారు. అందుకే ప్రతిపక్షాలకు చోటు ఇవ్వకుండా మొదటి నుంచి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిలా కాకుండా మరో రెండు మూడు టర్న్ లు ప్రజలు గుర్తుంచుకునేలా పాలన సాగించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అందుకే అధినేత చంద్రబాబు ఏ మంత్రులు, అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత సీఎం ఆఫీసులో కలుసుకోవడంతో పాటు, సరదాగా నవ్వుతూ కనిపించారు. అదే విధంగా తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సైతం ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తన కుమార్తెలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని, వాటిని చూసి వారు కన్నీరు పెట్టుకోవడంతో ఆవేదన చెందానంటూ పవన్ వెల్లడించారు. ఇంట్లోంచి బయటకు రావడానికి తన బిడ్డలు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేకపోయానంటూ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని హోంమంత్రి అనితతో కూడా పవన్ చెప్పారు. తన బిడ్డలకే ఇలాంటి పరిస్థితులు ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటనేది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశంగా భావించవచ్చు. పవన్ కల్యాణ్, అనిత భేటీతో కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కలిసే ఉంటుందని మరోసారి చెప్పకనే చెప్పినట్లైంది. దీంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీకి తాజా ఫొటోలతోనే సమాధానం చెప్పేశారు.
పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లడం.. అమిత్ షాతో ఆగమేఘాలపై భేటి కావడంతో కూటమిలో చిచ్చు మొదలైందని వైసీపీ ఆరోపించింది. పవన్ కేబినెట్ మీటింగ్ ఎగ్గొట్టి మరీ పోవడానికి కారణం అదేనన్నారు. అయితే కట్ చేస్తే.. ఢిల్లీ నుంచి రాగానే పవన్ చంద్రబాబుతో భేటి అయ్యి అమిత్ షాతో భేటి సంగతులను పంచుకోవడంతో ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. అయితే కూటమి ప్రభుత్వంపై పవన్ అలిగాడా? చంద్రబాబు పాలన తీరుపై ఢిల్లీ ఫిర్యాదు చేశాడా? బీజేపీ పెద్దలు వీరిద్దరి మధ్య కాంప్రమైజ్ చేశారా? ఇలా చాలా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. మొత్తానికి చంద్రబాబుతో పవన్, అనిత భేటి వెనుక కథ ఏంటన్నది మాత్రం ఆసక్తి రేపుతోంది. వివాదాలు పరిష్కరించుకునేందుకే ఈ భేటి జరిగిందన్నది మాత్రం అర్థమవుతోంది.