Pawan kalyan : రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అవుతోంది. కానీ ఇంతవరకు విభజన హామీలు పరిష్కారం కాలేదు. 2014 నుంచి 2019 మధ్య విభిన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పరిష్కారానికి నోచుకోలేదు.2019- 2024 మధ్య కెసిఆర్ తో ఏపీ సీఎం జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్న రాష్ట్ర ప్రయోజనాలకు అవి అక్కరకు రాలేదు. ఇలా పది సంవత్సరాలు వృధాగా మారింది. ఈ ఏడాది జూన్ 2 తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు తీరింది. కానీ దశాబ్ద కాలంగా విభజన చట్టంలో పొందుపరచాల్సిన అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉండిపోయాయి. అయితే ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ తో రాజకీయం నేతలు పబ్బం గడుపుకున్నారు. దీనిని గుర్తించిన తెలంగాణ ప్రజలు.. మోసం చేసిన పార్టీని రాజకీయంగా సమాధి కట్టారు. అటు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య నెలకొన్న భేదాలు, అడ్డుతెరలు.. ఇప్పుడిప్పుడే తొలగుతున్నాయి. ఇటువంటి క్రమంలో ఒక వివాదం తెరపైకి వచ్చింది. హైదరాబాదులో క్యాబులు నడుపుకొని జీవిస్తున్న రెండు వేల మంది డ్రైవర్లకు.. తెలంగాణ డ్రైవర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆల్ ఇండియా పర్మిట్ తో..తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకొని చాలామంది క్యాబ్ లు నడుపుతున్నారు. అయితే అటువంటి వారిని తెలంగాణ డ్రైవర్లు అడ్డుకుంటున్నారు. ఉమ్మడి రాజధాని గడువు పరిధి జూన్ 2తో ముగిసిందని.. ఇక్కడి నుంచి వెళ్లాలని వారిపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబాలతో జీవనం పొందుతున్న ఆ రెండు వేల మంది డ్రైవర్లకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.
* ఏపీ క్యాబ్ డ్రైవర్ల ఆవేదన
హైదరాబాదులో ఉపాధి పొందుతున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కలిసి తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. తాము పడుతున్న బాధలను వివరించారు. గత కొద్దిరోజులుగా తాడేపల్లి పార్టీ కార్యాలయంలో పవన్ ప్రజా దర్బారు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వేలాదిమంది క్యాబ్ డ్రైవర్లు అక్కడకు చేరుకొని.. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక వినతి పత్రం అందించారు.అయితే వారి బాధను చూసిన పవన్ చలించి పోయారు.తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు.
* వారికి భరోసా
తనను కలిసేందుకు వచ్చిన క్యాబ్ డ్రైవర్లతో పవన్ మాట్లాడారు.వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యత ఉండాలన్నారు. ఏపీలో రాజధాని పనులు మొదలుకాగానే ఎక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగుపడుతుందన్నారు. అప్పటివరకు సాటి డ్రైవర్లకు మానవతా దృక్పథంతో సహకరించాలని కోరారు. ఇది సున్నితమైన అంశమైనా.. దాదాపు రెండు వేల కుటుంబాల ఆవేదన అందులో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చారు.
* సమస్యకు పరిష్కార మార్గం
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొంది. రెండు ప్రభుత్వాలు సైతం పరస్పరం గౌరవించుకుంటున్నాయి. విభజన హామీల అమలుకు ఇటీవల రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. కీలక ప్రతిపాదనలు చేసుకున్నారు. ఇటువంటి తరుణంలో హైదరాబాదులో ఏపీ క్యాబ్ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. దీనిపై సానుకూల నిర్ణయం వచ్చే విధంగా చర్యలు చేపడతామని పవన్ హామీ ఇచ్చినట్లు సమాచారం.