Parakamani theft case: తిరుమల( Tirumala) పరకామణిలో చోరీకి సంబంధించి విచారణకు వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. పరకామణిలో పనిచేస్తున్న రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీ చోరీ చేసి పట్టుబడ్డారు. అప్పట్లో దీనిపై కేసు నమోదయింది. విజిలెన్స్ అధికారిగా ఉన్న సతీష్ కుమార్ ఫిర్యాదుతో తిరుపతి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. అయితే నాలుగు నెలలకే ఈ కేసు రాజీ చేసుకున్నారు. పరకామణిలో చోరీ చేసిన రవికుమార్ తనకున్న ఏడు ఆస్తులను టిటిడి కి గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే ప్రధాన అంశంగా మారింది. రవికుమార్ టిటిడి కి రాసిచ్చిన ఆస్తులు ఏవి? వాటి విలువ ఎంత? అప్పట్లో జరిగిన పరిణామాలు ఏమిటి? అనే దానిపై విచారణ చేపడుతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే ఈ రోజు కేసు విచారణకు హాజరైన వైవి సుబ్బారెడ్డి నుంచి కీలక వివరాలు సేకరించారు. అయితే అది తన హయాంలో జరగలేదని చెప్పి కొత్త సంచలనానికి తెర తీశారు వైవి సుబ్బారెడ్డి.
నాలుగు నెలలకే రాజీ
సాధారణంగా తిరుమల వెంకటేశ్వర స్వామి( Lord Venkateswara Swamy ) వారికి మొక్కుల రూపంలో విదేశీ కరెన్సీ కూడా వస్తుంది. ఈ మొక్కులన్నింటినీ పరకామణిలో ఉంచి ఎప్పటికప్పుడు లెక్కిస్తుంటారు. అక్కడే రవికుమార్ అనే వ్యక్తి పని చేసేవారు. ఆయనకు సంపాదనకు మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో 2023 ఏప్రిల్ 30న విదేశీ కరెన్సీ తో అప్పటి టీటీడీ విజిలెన్స్ అధికారి సతీష్ కు పట్టుబడ్డారు. ఆయన తిరుపతి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో రవికుమార్ను అప్పగించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయింది. కానీ సెప్టెంబర్లో అదే కేసును రాజీ చేసుకున్నారు ఫిర్యాదు అధికారి సతీష్ కుమార్. అయితే అప్పట్లో టిటిడి పెద్దలు ఒత్తిడితోనే ఆయన కేసు విత్ డ్రా చేసుకున్నారన్నది ఒక ఆరోపణ. అయితే అంతకుముందే రవికుమార్ తన ఏడు ఆస్తులను టిటిడి కి గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారు. వాటిని టిటిడి అధ్యక్షుడిగా ఉన్న వై వి సుబ్బారెడ్డి, ఈవో గా ఉన్న ధర్మారెడ్డి స్వీకరించారు.
కరుణాకర్ రెడ్డి హయాంలో?
అయితే ఇటీవల ఫిర్యాదుదారుడు, అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్( Satish Kumar) అనుమానాస్పద స్థితిలో తాడిపత్రిలో మృతి చెందారు. గుంతకల్లు రైల్వే పోలీస్ సిఐగా పనిచేస్తున్న ఆయనను విచారించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఒకసారి విచారించి వివరాలు సేకరించింది. రెండోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పింది. ఈ క్రమంలోనే విచారణ కోసం గుంతకల్లు నుంచి విజయవాడ వస్తుండగా.. మధ్యలో తాడిపత్రిలో సతీష్ కుమార్ చనిపోయారు. అనుమానాస్పద స్థితిలో ఆ మృతి ఉండడంతో పోలీసులు ప్రత్యేక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి తన హయాంలో ఇది జరగలేదని చెప్పి.. తర్వాత అధ్యక్షుడిగా ఉన్న కరుణాకర్ రెడ్డి వైపు సంకేతాలు పంపించారు. తద్వారా కొత్త సంచలనానికి తెర తీశారు. అయితే ఇప్పటికే కరుణాకర్ రెడ్డి సతీష్ కుమార్ మరణం పై స్పందించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ధృవీకరిస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. అయితే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి తన హయాంలో జరగలేదని చెప్పడం ద్వారా.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి క్లూ ఇచ్చినట్లు అయింది. దీంతో సిట్ కరుణాకర్ రెడ్డిని విచారణకు పిలుస్తుందా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.