Papikondalu Tour: చుట్టూ పచ్చని కొండల మధ్య బోట్‌లో ప్రయాణిస్తుంటే ఆ మజానే వేరు. ఇలాంటి అందమైన పాపికొండల టూర్‌ను ప్రతి ఒక్కరూ ఆస్వాదించాల్సిందే. అయితే గత నాలుగు నెలల నుంచి నిలిచిపోయిన పాపికొండల టూర్‌ను ఏపీ ప్రభుత్వం మళ్లీ నేటి నుంచి ప్రారంభించింది. ఇకపై మధ్యలో ఆపకుండా రోజూ ఉంటుందని ఏపీ టూరిజం శాఖ తెలిపింది. అయితే పాపికొండల్లో ఒకటి నుంచి రెండు రోజులు ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు టూర్ నిర్వాహకులు చెబుతున్నారు. పాపికొండలు టూర్‌కి ఏపీ, తెలంగాణ నుంచి కూడా వెళ్లవచ్చు. కొండల మధ్య బోట్ టూర్ చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైన ఈ టూర్‌కి వెళ్లాల్సిందే. ఎందుకంటే కొండల మధ్య పడవ ప్రయాణం జీవితంలో మర్చిపోలేరు. ఈ టూర్‌కి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని దేవీపట్నం మీదుగా వెళ్లవచ్చు. అలాగే తెలంగాణలో భద్రాచలం మీదుగా కూడా వెళ్లవచ్చు.
పాపికొండల్లో బోట్‌లో ప్రయాణిస్తారు. ఇక్కడ ప్రస్తుతం 21 బోట్లు ఉన్నాయి. ఇందులో 9 బోట్లకు టూరిజం శాఖ అనుమతులు ఉండగా.. మిగిలిన బోట్‌లకు మరికొన్ని రోజుల్లో అనుమతులు వస్తాయట. ఈ రోజు నుంచి టూర్ ప్రారంభమైంది. పర్యాటకులు ఇక నుంచి ఆన్‌లైన్‌లో టూర్ టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చని ఏపీ టూరిజం తెలిపింది. ఏపీ నుంచి వెళ్లాలనుకునే వారు మొదటి రాజమండ్రి చేరుకోవాలి. అక్కడ నుంచి గండిపోచమ్మ దేవాలయం వరకు ప్రైవేట్ వాహనాల్లో తీసుకెళ్లి.. ఆ తర్వాత బోట్ ఎక్కిస్తారు. గండిపోచమ్మ ఆలయం నుంచి దాదాపుగా 75 కిలో మీటర్లు లాంచీల్లో గోదావరిలో ప్రయాణిస్తారు. ఉదయం బోట్ ఎక్కడితే మధ్యాహ్నం 2 గంటలకు పాపికొండలు వెళ్లి మళ్లీ సాయంత్రానికి తిరిగి వస్తారు. అయితే ఈ టూర్ ప్యాకేజీలు ప్రైవేట్‌వి ఉంటాయి. సాధారణంగా అన్ని లాంఛీలకు ఒకటే ధర ఉంటుంది. మహా అయితే ఒక రెండు నుంచి మూడు వందలు తేడా ఉంటుంది.
గోదావరి నదిలో చుట్టూ కొండల మధ్య ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైన ప్రయాణించాల్సిన ప్రయాణాల్లో పాపికొండలు టూర్ ఒకటని చెప్పవచ్చు. గోదావరి సినిమా చూస్తుంటేనే చాలామందికి అరే ఎంత బాగుందో అనిపిస్తుంది. అలాంటిది డైరెక్ట్‌గా ఆ ఫీలింగ్‌ను ఆస్వాదిస్తే.. మాటల్లో చెప్పలేం. చుట్టూ కొండలు, లాంచీ, పొంగిపొర్లుతున్న గోదావరి స్వర్గంలా అనిపిస్తుంది. మళ్లీ మళ్లీ ఈ ప్రయాణం చేయాలనిపిస్తుంది. అయితే ఈ టూర్‌లో పోలవరం ప్రాజెక్టు, కొరుటూరు, కొల్లూరులోని వెదురు గుడిసెలు, పేరంటాలపల్లి ఆశ్రమం, కాటేజీలు చూడవచ్చు. అయితే ఈ ప్రయాణం ఎంత బాగుంటుందో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా లైఫ్ జాకెట్లు ధరించాలి. ఈ టూర్ ప్యాకేజీలను ఆఫ్‌లైన్ లేదా www.aptourismrajahmundri.com, https://tourism.ap.gov.in/tours వెబ్ సైట్లలో కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు.