Rain Alert In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఒడిస్సా లోని గోపాల్ పూర్( Gopalpur) దగ్గర తీరం దాటిన వాయుగుండం.. వైవ్య దిశగా కదిలి బలహీనపడింది. అయితే ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటే గ్రామంలో గురువారం వర్ష బీభత్సం సృష్టించింది. ఉత్తరాంధ్రలో కుండపోతగా వాన పడింది. అయితే వాయుగుండం బలహీనపడినా.. దాని ప్రభావం ఈరోజు కూడా ఉత్తరాంధ్రపై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడం విశేషం.
* ఉత్తరాంధ్ర పై ప్రభావం..
మరోవైపు విశాఖపట్నం( Visakhapatnam), అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయింది. తూర్పుగోదావరి, యానాం, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. అందుకే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే గత రెండు నెలలుగా ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు, తుఫాన్లతో మత్స్యకారులు తీరానికే పరిమితం అయ్యారు.
* జన జీవనానికి ఆటంకం.. ఉత్తరాంధ్రలోని( North Andhra) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ వర్షాల వల్ల చాలా చోట్ల ప్రజా జీవనానికి ఆటంకం కలిగింది. పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు సైతం నేలమట్టమయ్యాయి. దీంతో గురువారం రోజంతా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉత్తరాంధ్రకు వాయుగుండం నేపథ్యంలో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. అధికారులతో సమీక్షించారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలతకుండా చూడాలని కోరారు.
* నదుల్లో వరద ఉధృతి..
ఒడిస్సా లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్రలోనే ప్రధాన నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. వంశధారలో వరద ఉధృతి పెరిగింది. దీంతో కొట్టా బ్యారేజ్ వద్ద రెండో హెచ్చరిక స్థాయి దాటే అవకాశం ఉంది. నాగావళి నదిలో కూడా వరద తీవ్రత అధికంగా ఉంది. ఈ రెండు నదులకు సంబంధించిన పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు పిడుగులు పడే అవకాశం ఉన్న దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.