Google Data Center In Visakhapatnam: విశాఖ( Visakhapatnam) నగర అభివృద్ధిపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా దిగ్గజ ఐటి సంస్థలు విశాఖకు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రధానంగా ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయించేందుకు కూడా సిద్ధపడింది. అయితే గూగుల్ సెంటర్ కు ఇవ్వనున్న భూమికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. భూసేకరణను వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టులో కేసులు వేశారు. అయితే రైతులకు తెలియకుండా తప్పుడు కేసులు వేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో కూటమి ప్రభుత్వం కఠిన చర్యలకు దిశగా అడుగులు వేస్తోంది.
* ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా..
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా చంద్రబాబును( CM Chandrababu) విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ విమానాశ్రయంలో కలిశారు. గూగుల్ డేటా సెంటర్ భూసేకరణ పురోగతి, ఆ ప్రాంత రైతుల అభిప్రాయాలను సీఎం చంద్రబాబుకు కలెక్టర్ వివరించారు. అయితే రైతుల ముసుగులో కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు వేసినట్లు చంద్రబాబు తెలుసుకున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆటంకాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రైతులకు సంబంధం లేకుండానే వారి పేర్లతో కేసులు వేయడం.. అందులో చనిపోయిన ఓ రైతు పేరు ఉండడం పై తీవ్రంగా పరిగణించాలని చంద్రబాబు ఆదేశించారు.
* నిర్వాసితుల సమస్యల ప్రస్తావన
మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు( ganta Srinivas Rao ) నిర్వాసితుల తరుపున కొన్ని అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలు, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్, ఇంటి నిర్మాణానికి మూడు సెంట్లు స్థలం డిమాండ్ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లారు గంటా శ్రీనివాసరావు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. భూసేకరణకు సంబంధించి ఒకసారి పరిహారం ప్రకటించిన తర్వాత.. దాన్ని పెంచడం ఎక్కడ జరగదని.. ఇక్కడ రైతుల విజ్ఞప్తిని తప్పకుండా పరిగణలోకి తీసుకుందామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే రైతుల ముసుగులో వైసీపీ నేతలు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అడ్డుకుంటున్న విషయంపై మాత్రం చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.