Ramoji Rao: మనం పువ్వు విసిరితే పువ్వు నేరుగా వస్తుంది. రాయి విసిరితే సూటిగా వచ్చి మన డిప్ప పగలగొడుతుంది. దీనినే మన పరిభాషలో చెప్పాలంటే కాల ధర్మం అంటారు. దీనికి ఎవ్వడూ మినహాయింపు కాదు. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలుతుంది. ఆ గొడ్లు చచ్చిన ప్రాంతంలోనే ప్రాణాలు వదులుతుంది.. అందు చేత మనం ఎలాంటి పనులు చేస్తే అలాంటి ఫలితాలు వస్తాయి.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావ్ భయ్యా అంటే.. ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నా.. వెనకటికి పచ్చళ్ళు, పేపర్ కాంబినేషన్లో రామోజీరావు అనే మహాశయుడు అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా తెలుగు నాట వెలుగొందడం మొదలుపెట్టాడు. రామోజీ ఫిలిం సిటీ, అన్న దాత, సితార, డాల్ఫిన్ హోటల్, ఈటీవీ, ఉషా కిరణ్ మూవీస్, మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్.. ఇలా ఒకటా రెండా లెక్కకు మిక్కిలి. అందుకే కాబోలు అతడిని తెలుగు మీడియా మొగల్ అని స్తుతించడం ప్రారంభమైంది. వీటన్నింటికీ మించి మార్గదర్శి అనే కామధేనువు ఆయన చెంతన ఉండేది. ఆయన వేసిన ప్రతి అడుగుకు అది ఆర్థిక భరోసా ఇచ్చేది. ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.
జగన్ దెబ్బకు..
అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా మార్గదర్శి అక్రమాలు తవ్వడం మొదలుపెట్టాడు.. కానీ రామోజీరావు తనకున్న పరిచయాల ద్వారా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో రాజశేఖర్ రెడ్డి అడుగులకు బ్రేక్ వేయించాడు. తర్వాత మార్గదర్శి విషయంలో అనుకున్నంత వేగంగా దర్యాప్తు సంస్థల అడుగులు పడలేదు. తర్వాత రాజశేఖర్ రెడ్డి కన్నుమూశారు. ఈలోపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. రామోజీరావు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇక నా మార్గదర్శిని ఎవడు ఏమీ చేయలేడు అనే ధీమాలో ఉన్నాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది. జగన్ రూపంలో మార్గదర్శికి మరొక అడ్డంకి ఏర్పడింది.
సిఐడిని రంగంలోకి దించాడు
జగన్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఈనాడు అతడి జోలికి వెళ్లలేదు. జగన్ కూడా రామోజీరావును పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ ఇరుపక్షాల మధ్య మళ్లీ కాల్పులు మొదలయ్యాయి.. ఈనాడు జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాయడం ప్రారంభించింది. సాక్షి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ ఇక్కడే అసలు తిరకాసు మొదలైంది. సుప్రీంకోర్టులో ఇన్నాళ్లపాటు నిస్తేజంగా ఉన్న మార్గదర్శి కేసు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఇందులో ఇంప్లిడ్ అవుతారా అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరితే కెసిఆర్ నో చెప్పాడు. జగన్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో కేసులో మేం ఇంప్లీడ్ అవుతామంటూ ముందుకు వచ్చాడు. ఎలాగూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండనే ఉన్నాడు కాబట్టి మరింత లోతుల్లోకి వెళ్ళాడు. రామోజీరావును ఒత్తడం ప్రారంభించాడు. మార్గదర్శి అక్రమ వ్యవహారాల్లో నట్లు మరింత బిగించాడు. అంతేకాదు ఆ అక్రమాల నిగ్గు తేల్చేందుకు సిఐడిని రంగంలోకి దించాడు.
దెబ్బకి మంచం పట్టాడు
సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులని నేల నాకించిన చరిత్ర రామోజీరావు ది. ఓ ఎన్ టి రామారావు, దాసరి నారాయణరావు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది. అంతటి కాకలు తీరిన రామోజీరావును జగన్మోహన్ రెడ్డి మంచం ఎక్కేలా చేశాడు. అసలు కనీసం రామోజీరావు వైపు చూసేందుకు కూడా భయపడే పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయేలా తన ఇంటికి ఏకంగా సిఐడి అధికారులను విచారణ నిమిత్తం పంపించాడు.. వారి దెబ్బకు రామోజీరావు నడుముకు బెల్టు కట్టుకున్నాడు. శ్వాస ఆడకుంటే వెంటిలేటర్ ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు నన్ను వదిలేయండి నేను మీకు ఏమి చెప్పలేను అంటూ ప్రాధేయపడ్డాడు.. అంతేకాదు మార్గదర్శి ఎండీ శైలజ “మేము సమాజంలో పేరు ఉన్న వ్యక్తులను మా ఇంటికి వచ్చి ఇలా విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని” అని బతిమిలాడేలా చేశాడు.. అంతేకాదు మార్గదర్శి విషయంలో ఇంకా ముందుకే వెళ్తున్నాడు. దీనిపై ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే రామోజీరావు పరిస్థితి బాగోలేదు. మార్గదర్శి పరిస్థితి అంతకన్నా బాగోలేదు.