Telangana Assembly Elections: ‘ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే సమయం ఉంది.. అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగతాయి. అంతా రెడీగా ఉండాలి. నియోజకవర్గాల్లోనే పని చేయాలి’ బీఆర్‌ఎస్ ప్రతినిధులు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివీ. టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ ప్లీనరీ నిర్వహించారు. ఈ సంరద్భంగా కేసీఆర్ ఎన్నికలు అక్టోబర్‌లోనే వస్తాయని ప్రకటించారు. అయితే డిసెంబర్‌లో కదా ఎన్నికలు రెండు నెలలు ముందుగానే ఎందుకు వస్తాయని చెబుతున్నారని ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఇందులో లాజిక్ ఉందని.. ఎమ్మెల్యేలను సన్నద్ధం చేయడానికే ఇలా చెబుతున్నారని అంటున్నారు.
అక్టోబర్ డెడ్‌లైన్..
నిజానికి సమయం ప్రకారం జరిగినా అక్టోబర్ నెల ద్వితీయార్థంలో ఎన్నికల ప్రకటన ఉండొచ్చు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు చేసినా ఎన్నికలు డిసెంబర్‌లోనే వస్తాయి. అయితే కేసీఆర్ చెప్పిన అక్టోబర్‌లో లాజిక్ ఏమిటంటే.. ఎమ్మెల్యేలను సిద్ధం చేయడమే. అందుకే వారికి అక్టోబర్ డెడ్‌లైన్ పెట్టారని తెలుస్తోంది. ఇక ప్లీనరీలో మరో షాకింగ్ న్యూస్ చెప్పారు కేసీఆర్. ఈసారి సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు దక్కవని పరోక్షంగా చెప్పారు. గతంలో ఎప్పుడు కార్యవర్గ సమావేశం జరిగినా కేసీఆర్ పార్టీ నేతలందరికీ.. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఓ భరోసా ఇచ్చేవారు. సిట్టింగ్‌లు అందరికీ మళ్లీ టిక్కెట్లు ఇస్తామని.. నియోజకవర్గాలకు వెళ్లి పని చేసుకోవాలనిచెప్పేవారు. కానీ ఈసారి టోన్ కాస్త మారింది. ఇప్పటి వరకూ కేసీఆర్ .. కేటీఆర్ చేసిన హెచ్చరికల ప్రకారం చాలా మందికి టిక్కెట్లు డౌట్ అని ప్రచారం ప్రారంభమైంది. సర్వేల్లో అనుకూలంగా వచ్చే వారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక..
ఇక చాలా మంది ఎమ్మెల్యేలు పనితీరును మార్చుకోవాలని కేసీఆర్ సూచించారు. గతంలో దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలకు ఈ సారి టిక్కెట్ ఉండదన్న ప్రచారం సాగింది. అదే సమయంలో అలాంటి ఎమ్మెల్యేల పేర్లు కొన్ని తెరపైకి వచ్చాయి. బీజేపీ వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని తెలియగానే.. టీఆర్‌ఎస్ హైకమాండ్ అప్రమత్తమయినట్లుగా కనిపిస్తోంది. సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఉంటాయని స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు మాత్రం 50 మందికి కాకపోయినా 30 మందికి టిక్కెట్లు డౌటేనని తెలుస్తోంది.
మొత్తంగా తాజాగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ ప్లీనరీ మొత్తం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనే జరిగింది. సూచనలు, హెచ్చరికలు, దిశానిర్దేశంతో సమావేశం జరిగింది.