Srikakulam : చుట్ట తాగే అలవాటు ఆ వృద్ధురాలి ఉసురు తీసింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఆమె ప్రాణాలను బలిగొంది. చుట్ట వెలిగిస్తుండగా ఆ నిప్పు చీర పై పడింది.దానికి ఫ్యాన్ ఆజ్యం పోసింది.క్షణాల్లో మంటల్లో వృద్ధురాలు చిక్కుకుంది. తీవ్ర గాయాల పాలయ్యింది. కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు అనే గ్రామంలో జరిగింది.జడ్డు వరహాలమ్మ అనేవృద్ధురాలి భర్త చనిపోయాడు.దీంతో గ్రామంలో ఉన్న అల్లుడు సూర్యనారాయణ ఇంట్లో ఉంటోంది. ఆమెకు రోజు చుట్ట తాగే అలవాటు ఉంది. సోమవారం ఎప్పటిలానే చుట్ట కాలుస్తుండగా నోటి నుంచి ఒంటిపై ఉన్న దుస్తులపై పడింది. ఆ వెంటనే ఫ్యాన్ గాలికి చుట్టం నుంచి మంటలు చెలరేగి అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఆమె పెద్దగా కేకలు వేశారు.కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. మంటలను అదుపు చేసే లోగా 90 శాతం శరీరం కాలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వరహాలమ్మ మృతి చెందారు.
* ఇప్పటికీ చుట్టలు తాగే అలవాటు
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చుట్టలు తాగడం ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో సర్వసాధారణం. పురుషులతో సమానంగా వృద్ధ మహిళలు చుట్టలు తాగుతుంటారు. అనారోగ్యానికి కారణమని తెలిసినా వారు వెనక్కి తగ్గరు. అలాగని చుట్టలు తాగిన వారు ఆరోగ్యంగా కూడా కనిపిస్తుంటారు. అయితే అది వారి నమ్మకంగా భావిస్తుంటారు. ఇలాంటి అలవాటే వరహాలమ్మకు ఉంది. అయితే ఆమె అనారోగ్యానికి గురి కాలేదు కానీ.. చుట్ట మూలంగా అగ్ని ప్రమాదానికి గురై మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
* పోలీసుల దర్యాప్తు
తొలుత చుట్ట అంటుకొని మంటలు వ్యాపించడం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది.అల్లుడు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి చుట్ట ప్రమాదంతోనే ఈ ఘటన జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More