JC Asmit Reddy : ఏపీలో పోలీస్ వ్యవస్థకే దారుణమైన అవమానం ఇది: వీడియో వైరల్

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను సొంత కార్యకర్తల కంటే ఎక్కువగా వాడుకుంది. వారితో రకరకాల పనులు చేయించింది. అందువల్లే పోలీస్ వ్యవస్థ నాశనమైంది" ఇవీ ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత చేసిన విమర్శలు. ఆమె చేసిన వాటిల్లో నిజం కూడా ఉంది. అయితే ఇక్కడ టిడిపి నేతలు అంతకుమించి చేస్తున్నారని అపవాదు ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 28, 2024 2:26 pm

JC Asmit Reddy

Follow us on

JC Asmit Reddy: : ” అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.. ఒక సీఐతో ఆయన క్షమాపణ చెప్పించుకున్న తీరు సంచలనంగా మారింది. దీనికి ప్రధాన కారణం తాడిపత్రిలో ఇసుక తరలింపు అక్రమ వ్యవహారం. ఇది రోజుకో మలుపు తిరగడంతో అస్మిత్ రెడ్డికి సీఐ క్షమాపణలు చెప్పేదాకా వెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. పోలీస్ వ్యవస్థ సర్వనాశనం అయిందని.. ఇది దారుణమైన అవమానమని మండిపడుతున్నారు. అస్మిత్ రెడ్డి వ్యవహారశాలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తెలుగుదేశం పార్టీ పరిపాలన లో పోలీసులకు ఆ కాస్త గౌరవం కూడా దూరమైందని విమర్శిస్తున్నారు.

తాడిపత్రిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ యజమానులపై కేసుల నమోదు చేయాలని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఇటీవల రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తనకు సీఐ క్షమాపణలు చెప్పాలంటూ రెండు గంటలపాటు అస్మిత్ రెడ్డి నానా హంగామా చేశారు. చివరికి ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలోకి ప్రవేశించారు. అస్మిత్ రెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో డీసీపీ సీఐ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. దీంతో సీఐ క్షమాపణలు చెప్పడంతో అస్మిత్ రెడ్డి బెట్టు వీడారు. వీడియో కాల్ లో ఎమ్మెల్యేకు సీఐ క్షమాపణలు చెబుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతమైన విస్తృతిలో ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే వ్యవహార శైలిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

“శాంతిభద్రతలు కాపాల్సిన పోలీసులతో ఇలాంటి పనులు చేయించడం ఏంటి? ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించడం ఏంటి? నచ్చిన పనులు చేయకుంటే పోలీసులు కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనా? ఇదెక్కడి న్యాయం.. గతంలో వైసిపి వాళ్ళు ఇలా చేస్తేనే కదా మీకు అధికారం ఇచ్చింది.. మీరు కూడా వారిలాగే వ్యవహరిస్తే ఎలా? అప్పుడు వారికి, మీకు పెద్దగా తేడా ఏముంటుందని” నెటిజన్లు ఆరోపిస్తున్నారు..

కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాడిపత్రిలో ఇసుక అక్రమ తరలింపు వ్యవహారానికి సంబంధించి రోజుకో తీరుగా వార్తలు వస్తున్నాయి.. తన అనుచరులు, టిడిపి నాయకులు కిష్టారాజ్యంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో తాడిపత్రి నియోజకవర్గంలో అడుగుపెడితే ఊరుకోబోమని, ఈ ప్రాంతానికి వచ్చిన టిప్పర్ తిరిగి వెళ్ళదని యజమానులకు ప్రభాకర్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు..

“నియోజకవర్గంలో 2.5 లక్షల మంది ఉన్నారు. కేవలం 25 మంది మాత్రమే ఇసుకను తరలించుకుంటూ సంపాదించుకుంటున్నారు.. నేను కూడా ఐదేళ్ల వైసిపి పరిపాలన కాలంలో తీవ్రంగా నష్టపోయాను. ఆ ఇసుక వ్యవహారాన్ని నాకు వదిలేయాలి. మీకు అమ్ముకోవడం రావడం లేదు. నేను దానిని అమీ పెడతాను. ఇసుక రవాణాపై ఏసీబీ తనిఖీలు చేస్తోంది. కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి.. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇసుక తరలింపు వ్యవహారంపై ఎన్జీటీ దాకా వెళ్లాను. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాను. ఇప్పుడు నా నియోజకవర్గంలో ఇసుకను అడ్డగోలుగా తరలిస్తున్నారు. ఇలాంటి అప్పుడు నేను చూస్తూ ఊరుకోవాలా” అని ప్రభాకర్ రెడ్డి ఆ వీడియోలో పేర్కొన్నారు.