NTR Jayanti : నందమూరి తారక రామారావు( Nandamuri taraka Rama Rao) .. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాల పేరు వింటేనే కోట్లాదిమంది పులకరించి పోతారు. పేదలు చేతులు పైకెత్తి కొలుస్తారు. 33 ఏళ్ల సినిమా జీవితంలో ఎదురులేని హీరోగా నిలిచారు తారక రాముడు. 13 సంవత్సరాల రాజకీయ గమనంలో ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తాను నమ్మిన సిద్ధాంతాలను చివరివరకు ఆచరించి చూపించారు నందమూరి తారక రామారావు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అన్న మాటను నిజం చేస్తూ జనం గుండెల్లో నిలిచారు. ఆయన పుట్టి వందేళ్లు పూర్తవుతోంది. ఆయన భౌతికంగా దూరమై మూడు దశాబ్దాలు దాటుతోంది. అయితేనేం ఆ మహనీయుడు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచారు. నందమూరి తారక రామారావు జయంతి నేడు. అందుకే ‘ఓకే తెలుగు’ ప్రత్యేక కథనం మీకోసం.
* కారణజన్ముడు..
తెలుగు ప్రజల కోసమే కారణజన్ముడయ్యారు నందమూరి తారక రామారావు. 1923 మే 28న ఏపీలోని కృష్ణాజిల్లా( Krishna district) పామర్రు మండలం నిమ్మకూరులో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. 1942 మే నెలలో మేనమామ కుమార్తె అయిన బసవ రామ తారకాన్ని వివాహం చేసుకున్నారు. తొలి సంతానం కలిగిన తర్వాత రిజిస్టార్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరారు. కానీ ఆ ఉద్యోగం నచ్చక తనకు ఇష్టమైన సినిమాల్లో నటించడానికి మదరాసు వెళ్లారు. ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ తొలిసారిగా మన దేశం సినిమాలో నటించారు. క్రమేపి గుర్తింపు పొందారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు.. ఇలా ఎన్నో పాత్రల్లో మెప్పించారు. ఆ రాముడిని తారక రాముడిలో చూసుకున్నామని ఇప్పటికీ జనాలు చెబుతుంటారు. దేవుడంటే ముందుగా ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్న వారే అధికం. దాదాపు 400 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు నందమూరి తారకరామారావు. నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నారు.
Also Read : ఎన్టీఆర్ జయంతిః మెగాస్టార్, తారక్ స్పెషల్ ట్వీట్స్
* అలా రాజకీయాల్లోకి..
ఉన్నది చిత్రరంగం( cine industry) అయినా.. సమాజానికి ఏదో చేయాలన్న తలంపుతో నిత్యం ఉండేవారు ఎన్టీఆర్. దివిసీమ ఉప్పెన సమయంలో సాటి సినిమా నటులతో జోలె పట్టారు. విరాళాలు సేకరించి బాధితులకు అందజేశారు. అప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న బీజం పడింది. అలా 1982 మార్చి 29న ఆయన నుంచి ఒక ప్రకటన వచ్చింది. హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కేవలం పది మంది విలేకరుల మధ్యన తెలుగుదేశం పార్టీ ప్రకటన చేశారు ఎన్టీఆర్. తెలుగుదేశం ఒక శ్రామికుడి చెమట లో నుంచి వచ్చింది.. కార్మికుడి కరిగిన కండరాలలో నుంచి వచ్చింది.. రైతు కూలీల రక్తం లో నుంచి వచ్చింది.. నిరుపేదల కన్నీటిలో నుండి… కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం. రండి ఆశీర్వదించండి అంటూ నినదించారు ఎన్టీఆర్. నాటి ఆయన పిలుపే జన ప్రభంజనమైంది. చైతన్య రథం ఎక్కి ఊరు రా తిరిగారు ఎన్టీఆర్. ఆయన ప్రసంగాలు జనాలను ఉత్తేజపరిచాయి. అన్నగారితో కలిసి నడిచేందుకు వందలు వేలు లక్షలాదిగా జనాలు తరలివచ్చారు. జననీరాజనం పట్టారు. దీంతో పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి అధికారంలోకి రాగలిగారు. దేశ రాజకీయాల్లోనే విను సంచలనమయ్యారు. మూడుసార్లు గెలిచిన ఎన్టీఆర్.. ఏడు సంవత్సరాలు పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే ఆయన గద్దె దిగే వరకు రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాలించిన ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు.
* పేదవాడికి స్వర్ణ యుగం..
ఎన్టీఆర్( NTR) పాలన పేదవాడికి ఒక స్వర్ణ యుగంగా సాగింది. రెండు రూపాయలకే కిలో బియ్యం, పింఛన్ పథకం ఆయన చలువే. ఆంధ్రప్రదేశ్కు తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్టీఆర్.. వెంటనే తాను ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ చేశారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. పేదల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. పేదలకు గృహ నిర్మాణ పథకం ప్రారంభించింది నందమూరి తారక రామారావు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అన్న ఆశయంతో పాలన సాగించారు ఎన్టీఆర్. అందుకే పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1994లో మూడోసారి చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్నారు.
* రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు..
అయితే ఎన్టీఆర్ సినిమా జీవితం సాఫీగా సాగింది. కానీ రాజకీయ జీవితం ఎన్నెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. సీఎంగా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో చాలామందికి వ్యతిరేకంగా మారిపోయారు. 1984 ఆగస్టు 16న నాదేండ్ల భాస్కరరావు రూపంలో ఎన్టీఆర్ తిరుగుబాటు ఎదుర్కొన్నారు. అయితే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజా ఉద్యమాన్ని నడిపారు. తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్నారు. 1985లో ప్రజాతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. తిరిగి అధికారంలోకి రాగలిగారు. కానీ 1989 ఎన్నికల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న ఎన్టీఆర్ ప్రభుత్వం.. అపజయం ఎదుర్కొంది. చిత్తుగా ఓడిపోయింది. అయితే ఆ సమయంలోనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేయగలిగారు ఎన్టీఆర్. 1989 నుంచి 94 మధ్య కాంగ్రెస్ పాలనలో చాలా ఇబ్బందులు పడ్డారు ఎన్టీఆర్. అయితే కాంగ్రెస్ తో వైరం ఉన్న 1991లో నంద్యాల ఉప ఎన్నికల్లో.. పీవీ నరసింహారావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలపలేదు. కేవలం తెలుగువారు అన్న గౌరవంతోనే పీవీ నరసింహారావు ఎన్నికకు సహకరించారు.
* 1995 సంక్షోభంతో..
అయితే రాజకీయాల్లో ఉంటూనే కీలకమైన పాత్రల్లో సినిమాల్లో నటించారు. అటువంటి సమయంలోనే లక్ష్మీపార్వతి ఆయనకు దగ్గరయ్యారు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే 1994లో టిడిపి అధికారంలోకి వచ్చింది. పార్టీతో పాటు ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి జోక్యం పెరిగింది. అదే కుటుంబంలో అగ్గి రాజేసింది. టిడిపి ఎమ్మెల్యేల సహకారంతో అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు. అటు తరువాత 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో చనిపోయారు నందమూరి తారక రామారావు. అయితే ఆయన భౌతికంగా దూరమై మూడు దశాబ్దాలు దాటుతున్నా.. ఇప్పటికీ పేదల గుండెల్లో ఆయన చిరస్మరణీయుడే. ఆయన జయంతి సందర్భంగా మరోసారి ఆయనను స్మరించుకుందాం.