Kadapa Municipal Corporation: కడపలో( Kadapa ) మరో ఎన్నిక వచ్చింది. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప మేయర్ స్థానానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 11న ఎన్నిక జరగనుంది. మేయర్ గా ఉన్న సురేష్ బాబు పై అవినీతి ఆరోపణలు రావడంతో వే టు వేసింది ఏపీ ప్రభుత్వం. కొత్త మేయర్ ఎన్నిక అనివార్యంగా మారడంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం ఐదు నెలల పదవీకాలం మాత్రమే ఉంది. అయినా సరే రాజకీయంగా పట్టు సాధించాలంటే ఈ ఎన్నిక కీలకంగా భావిస్తోంది తెలుగుదేశం. అయితే ఇది ఒక విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణ సంకటమే. ఎందుకంటే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. పులివెందులలో అయితే డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు కడపలో పట్టు సాధించాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాహసం అని చెప్పాలి.
* వైసీపీకి మెజారిటీ..
కడపలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. 2021 లో జరిగిన ఎన్నికల్లో 50 స్థానాలకు గాను 48 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒకచోట టిడిపి, మరోచోట జనసేన గెలిచింది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు కనిపించింది. చాలామంది కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరారు. కడప ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ఇక్కడ పట్టు సాధిస్తూ వచ్చారు. ఆమెను సవాల్ చేశారు మేయర్ సురేష్ బాబు. దీంతో ఆమె పట్టు పట్టి సురేష్ బాబు అవినీతిని బయటకు తీశారు. దీంతో ప్రభుత్వం ఆయన పై వేటు వేసింది.
* టిడిపికి పెరిగిన బలం..
మొన్నటి ఎన్నికల్లో కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో టిడిపి గెలిచింది. ఆపై టిడిపికి ఎమ్మెల్సీలు సైతం ఉన్నారు. వారికి ఎక్స్ అఫీషియో సభ్యుల రూపంలో ఓట్లు ఉండనున్నాయి. ఆపై వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్ల సాయంతో కడప మేయర్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని టిడిపి వ్యూహరచన చేస్తోంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మేయర్ ఎన్నిక అనేది అవసరం లేదు. కానీ ప్రత్యేక పరిస్థితుల్లోనే మీరు ఎన్నిక నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం తాత్కాలిక మేయర్గా కొనసాగుతున్నారు. ఆమెను కొనసాగించవచ్చు కూడా. అయితే మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ పై సవాల్ చేస్తూ మాజీ మేయర్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. రేపు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. గతంలో కూడా మేయర్ పై వేటు వేసిన క్రమంలో ఆయన హైకోర్టుకు వెళ్లి ఉపశమనం దక్కించుకున్నారు. మరి కోర్టు ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.