https://oktelugu.com/

YSR Family : వైఎస్సార్ ఫ్యామిలీలో అడ్డగోలు చీలిక.. ఎవరెవరు ఎవరి వైపు అంటే?

ఫ్యామిలీ వివాదాలు రచ్చకెక్కితే మూల్యం తప్పదు. ఇప్పుడు వైఎస్సార్ కుటుంబానికి ఎదురైంది అదే. తండ్రి వారసత్వ ఆస్తి కోసం జగన్, షర్మిలలు పెద్ద పోరాటమే చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబంలో అడ్డగోలు చీలిక వచ్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 2, 2024 12:30 pm
    YSR Family

    YSR Family

    Follow us on

    YSR Family :  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సుదీర్ఘ చరిత్ర. ఉమ్మడి రాష్ట్రంపై చెరగని ముద్ర వేశారు రాజశేఖర్ రెడ్డి. వైయస్ రాజారెడ్డి ఏర్పాటుచేసిన పునాదిపై రాజకీయాలను ప్రారంభించారు రాజశేఖర్ రెడ్డి. అనతి కాలంలోనే కడప జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు. సుదీర్ఘకాలం పోరాడారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ తోడైంది. కాంగ్రెస్ పార్టీకి ఆయన అండగా ఉన్నారు. ఇలా పరస్పరం పోరాటం చేసి 2004లో అధికారంలోకి వచ్చారు రాజశేఖర్ రెడ్డి. రెండోసారి అధికారంలోకి రాగలిగారు. కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో.. ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచారు జగన్. ఏకంగా కాంగ్రెస్ పార్టీని విభేదించి వైసీపీని ఏర్పాటు చేశారు. ఎన్నో కష్టాలను అధిగమించి ఏపీలో అధికారంలోకి రాగలిగారు. అయితే 2019 వరకు రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఐక్యతగా కనిపించింది. కానీ బాబాయ్ వివేకానంద రెడ్డి, షర్మిల రాజకీయంగా విభేదించడం, తండ్రి మరణం పై సునీత పోరాటం.. ఈ పరిణామాలన్నీ ఆ కుటుంబాన్ని అడ్డగోలుగా చీల్చేశాయి. ఇప్పుడు ఏకంగా రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తి వివాదం తెరపైకి రావడంతో ఆ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజశేఖర్ రెడ్డి కుటుంబమే కాదు బంధువుల్లో సైతం అడ్డగోలు చీలిక వచ్చింది.

    * ఒక్కొక్కరు ఒక్కో వైపు
    కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కొందరు జగన్ వైపు ఉండగా.. మరికొందరు షర్మిలకు అండగా నిలుస్తున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో జగన్ సైతం జాగ్రత్తలో పడినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆయన పులివెందులలో గడిపిన సంగతి తెలిసిందే. అయితే గతంలో కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లేవారు కాదు. కానీ ఈసారి మాత్రం ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లారు. వారితో ఏకాంతంగా చర్చలు జరిపారు. అయితే అది మద్దతు కూడగట్టడానికేనని ప్రచారం జరుగుతోంది. తల్లి విజయమ్మ లేఖ రాసిన తరువాత.. జగన్ లో ఒక రకమైన కలవరం ప్రారంభమైనట్లు సమాచారం. వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వదులుకునేందుకు ఆయన ఇష్టపడడం లేదని తెలుస్తోంది. అన్నింటికీ మించి తనను రాజకీయంగా డ్యామేజ్ చేసిన చెల్లెలు వైపు తల్లి వెళ్లడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం.

    * తల్లి అలా తేల్చేయడంతో
    వైయస్ విజయమ్మ సైతం ఇప్పుడు ఉన్నవన్నీ ఉమ్మడి ఆస్తులేనని తేల్చి చెబుతూ లేఖ రాయడం.. జగన్ కు రుచించడం లేదు. గత ఐదేళ్లుగా రాజకీయంగా తనను బాగా డామేజ్ చేశారని.. ఒక విధంగా కుటుంబ పరువు పోయేందుకు వారే కారణమని జగన్ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కుటుంబంతో పాటు బంధువులు, సన్నిహితుల మద్దతు కూడగడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్కు అండగా బాబాయ్ వై.వి సుబ్బారెడ్డి, సోదరుడు అవినాష్ రెడ్డి, బాబాయ్ భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, మేనత్త విమలమ్మ, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. షర్మిలకు అండగా తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్, సోదరి వైయస్ సునీత, చిన్నమ్మ సౌభాగ్యమ్మ తో పాటు వరుసకు మేనమామ గా భావించే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అండగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే నాడు బలంగా ఉన్న కుటుంబం.. ఇలా వేరుపడి బలహీనం కావడాన్ని.. వైయస్సార్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.