Jagan: జగన్ పై ఉత్తరాంధ్ర నేతల ఆగ్రహం.. కారణం అదే!

జగన్ మొండిఘటం. ఇది ఎవరో అన్న మాట కాదు. సొంత పార్టీ శ్రేణులు అధినేత తీరుపై ఇలా మాట్లాడుతుంటారు. అయితే ఇప్పుడు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇటువంటి సమయంలో కూడా జగన్ అదే తీరున వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

Written By: Dharma, Updated On : October 19, 2024 10:56 am

YS Jagan Mohan Reddy

Follow us on

Jagan: జగన్ తీరుపై పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారా? రీజనల్ కోఆర్డినేటర్ల నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? ముఖ్యంగా విజయ్ సాయి రెడ్డి నియామకం పై వ్యతిరేకత వ్యక్తం అవుతుందా? ఆయనను వద్దని ఉత్తరాంధ్ర నేతలు అధినేతను కోరారా? అయినా జగన్ వినడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో సమూల మార్పులకు దిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాల వారీగా రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు. ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. వై వి సుబ్బారెడ్డి ని రాయలసీమకు పంపించారు. ఉభయగోదావరి జిల్లాల బాధ్యతలను బొత్స సత్యనారాయణ కు అప్పగించారు. గోదావరి జిల్లాల బాధ్యతను చూస్తున్న మిధున్ రెడ్డిని కృష్ణ, గుంటూరు జిల్లాలకు పంపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు, నెల్లూరు బాధ్యతలు కట్టబెట్టారు. మరో ఎంపీ అయోధ్య రామ రెడ్డికి ఒక జిల్లాను మాత్రమే కేటాయించారు. అయితే ఆ ఐదుగురి విషయంలో ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. కానీ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం ఉత్తరాంధ్ర నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయినా జగన్ పెడచెవిన పెట్టినట్లు సమాచారం. దీంతో వైసీపీ నేతలు ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. ముఖ్యంగా భర్త సత్యనారాయణ తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది.

* నేతల మధ్య విభేదాలు
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. విశాఖను పాలన రాజధానిగా ప్రకటించింది. అందుకే విశాఖ కేంద్రంగా చేసుకొని ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఓకే కానీ.. పార్టీ నేతల మధ్య విభేదాలకు విజయసాయిరెడ్డి కారణమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో వర్గాలను ప్రోత్సహించారన్న అపవాదు ఉంది. ముఖ్యంగా విశాఖలో భూదందా ఆరోపణలు ఆయనపై వచ్చాయి. అవి పార్టీకి అంతిమంగా నష్టం చేకూర్చాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేశాయి. అందుకే విజయసాయి రెడ్డి అంటేనే ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు భయపడిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడే విజయసాయిరెడ్డిని అడ్డుకోలేకపోయామని.. ఇప్పుడు నియోజకవర్గాల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

* బొత్సలోనూ అసంతృప్తి
వాస్తవానికి ఉత్తరాంధ్ర రీజనల్ బాధ్యతలను బొత్స ఆశించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇటీవల బొత్స ఎన్నికైన సంగతి తెలిసిందే. తనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగిస్తేనే ఎమ్మెల్సీ పదవికి పోటీ చేస్తానని బొత్స షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు జగన్ ఓకే చెప్పడంతోనే బొత్స రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇప్పుడు తనను కాదని విజయసాయి రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించడం పై బొత్స ఆగ్రహం గా ఉన్నట్లు సమాచారం. గోదావరి జిల్లాల్లో జనసేన హవా నడుస్తోంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు బొత్స సేవలను ఉపయోగించుకోవాలని జగన్ భావించారు. అయితే గోదావరి జిల్లాల బాధ్యతల కంటే.. ఉత్తరాంధ్ర బాధ్యతలకు ఎక్కువగా మొగ్గు చూపారు బొత్స. కానీ జగన్ మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. విజయసాయి రెడ్డికి ఇవ్వడంతో వైసీపీ నేతలు అసంతృప్తి కనిపిస్తోంది. ఇది ఎంతవరకు చేటు తెస్తుందోనని క్యాడర్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.