North Andhra Election Buzz: ఉత్తరాంధ్రలో( North Andhra) రాజకీయాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వారసులను తెరపైకి తేనున్నారు నాయకులు. ఈసారి తాము తప్పుకొని తమ వారసులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో సీనియర్ మోస్ట్ లీడర్లు చాలామంది ఉన్నారు. 2029 నాటికి వారంతా పక్కకు తప్పుకొన్నారు. తమ పిల్లలను రంగంలోకి దించనున్నారు.
1. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరు. క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకొని కుమారుడు చింతకాయల విజయ్ కు అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే విజయ్ తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా విభాగం బాధ్యతలు కూడా చూశారు. లోకేష్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
2. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సైతం వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటారని తెలుస్తోంది. కుమారుడు భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గంలో టిడిపి బాధ్యతలను ఆయనే చూస్తున్నారు.
Also Read: వారం రోజులకే సీఎం కుర్చి దిగిపోయారు.. ఆ తర్వాత నితీష్ కుమార్ కథ మొదలైంది!
3. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సైతం ఈసారి ఎన్నికల నుంచి తప్పుకుంటారు. పరవాడ నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. ఈసారి మాడుగుల నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు పోటీలో ఉంటారని తెలుస్తోంది.
4. మాజీమంత్రి బొత్స సత్యనారాయణ సైతం క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటారని సమాచారం. ఆయన వారసురాలిగా కుమార్తె డాక్టర్ అనూష పోటీ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. తరచూ పర్యటనలు చేస్తున్నారు. కుమార్తె అనూషను చీపురుపల్లి నుంచి పోటీ చేయించి బొత్స ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు చూస్తారని సమాచారం.
5. మాజీమంత్రి కళా వెంకట్రావు సైతం వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి గత ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు. బొత్స సత్యనారాయణ పై గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు ను బరిలో దించాలని కళా వెంకట్రావు భావిస్తున్నారు.
6. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటారని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లోనే తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కు టికెట్ ఇవ్వాలని ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరారు. అందుకు జగన్ అంగీకరించకపోవడంతో తానే పోటీ చేయాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయన బదులుగా కుమారుడు రంగంలోకి ఉంటారని తెలుస్తోంది.
Also Read: షేక్ హసీనా పై ఇంతటి ప్రతీకారమా? మరణ శిక్ష వెనక అసలు కారణమిదే!
7. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం కుమారుడు చిరంజీవి నాగ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లోనే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని కోరారు. కానీ వీలు పడలేదు. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా తన కుమారుడికి టికెట్ ఇప్పించేందుకు సీతారాం పావులు కదుపుతున్నట్లు సమాచారం.
8. మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ సైతం ఈసారి ఎన్నికల బరిలో ఉండరని తెలుస్తోంది. తన బదులు తన కుమారుడు కృష్ణ చైతన్యకు అవకాశం కల్పించాలని జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు సమాచారం. ప్రస్తుతం వైసీపీ వ్యవహారాలన్నీ కృష్ణ చైతన్య చూసుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని తెలుస్తోంది.