AP Elections 2024: ఏపీలో ఎవరు వచ్చినా పాలన కష్టమే!

AP Elections 2024 విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఏపీ సర్కార్ కు 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పును భరించాల్సిన అవసరం కొత్త ప్రభుత్వం పై ఉంది. కూటమి అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Written By: Dharma, Updated On : May 29, 2024 11:50 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలన అంతా ఈజీ కాదు. ఇప్పటికే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ప్రజాభిప్రాయం ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యింది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. జూన్ 9 నుంచి కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభం కానుంది. అయితే ఇచ్చిన హామీలు, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అమలు ఆషామాషీ విషయం కాదు. కనీసం కొత్త ప్రభుత్వం కుదుటుపడాలంటే, పాలన గాడిలో పడాలంటే దాదాపు రెండు సంవత్సరాల కాలం పట్టడం ఖాయం. అయితే జగన్ అధికారంలోకి వస్తే.. ఇప్పుడున్న దానికి కొనసాగింపు ఉంటుంది. అదే కూటమి అధికారంలోకి వస్తే మాత్రం.. చంద్రబాబుకు కత్తి మీద సామే.

విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఏపీ సర్కార్ కు 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పును భరించాల్సిన అవసరం కొత్త ప్రభుత్వం పై ఉంది. కూటమి అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరుస్తామని కూడా చెప్పుకొచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంట్లో ఆర్థిక భరోసా, పిల్లల చదువుకు ప్రోత్సాహం, సాగుకు పెట్టుబడి నిధి వంటి భారీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో పెట్టింది. ఇవన్నీ అమలు చేయడం కష్టతరం.అసలు సంక్షేమానికి దూరంగా ఉండే చంద్రబాబు.. అధికారంలోకి వచ్చేందుకు తప్పనిసరి అయి పెద్ద ఎత్తున పథకాలు ప్రకటించారు. వీటన్నింటినీ అమలు చేస్తారా? చేయలేరా? లేకుంటే ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. నాలుగు వేలకు పింఛన్ మొత్తాన్ని పెంచుతానని ప్రకటించారు. దివ్యాంగులకు, కిడ్నీ బాధితులకు పింఛన్ మొత్తాన్ని పెంచుతామని కూడా చెప్పుకొచ్చారు. వాటిని అమలు చేయాలంటే కష్టతరంతో కూడుకున్న పని. మరోవైపు అభివృద్ధి చేపట్టాల్సి ఉంది. అమరావతి రాజధానిని డెవలప్ చేయాలి. ఒకవైపు సంపద పెంచుతూనే.. సంక్షేమం, అభివృద్ధికి సమప్రా ధాన్యం ఇవ్వాలి. ఉన్నది ఐదు సంవత్సరాల గడువు మాత్రమే. కనీసం రాష్ట్ర ఆదాయం పెంచాలంటే రెండేళ్ల సమయం పడుతుంది. ఈ రెండేళ్లలో అప్పులు ఎలా తగ్గించుకుంటారు. కొత్త అప్పులు ఎలా పుట్టించుకుంటారు. రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతారు.. ఇవన్నీ సవాళ్లు కిందే పరిగణించాల్సి ఉంటుంది. జగన్ అధికారంలోకి వస్తే కొత్తగా పథకాలు అమలు చేయాల్సిన పనిలేదు. ఉన్న వాటిని కొనసాగిస్తే చాలు. కానీ టిడిపి కూటమి అధికారంలోకి వస్తే మాత్రం కొత్తగా మార్పు చేసి చూపించాలి. లేకుంటే ప్రజలు విశ్వసించే ఛాన్స్ లేదు.