Chandrababu: మంత్రివర్గ కూర్పు చంద్రబాబుకు ఈజీ కాదు

Chandrababu జనసేన నుంచి పవన్ తో పాటు చాలామంది సీనియర్లు పోటీ చేశారు. ఆ పార్టీలో రెండో స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలో ఉన్నారు.

Written By: Dharma, Updated On : May 29, 2024 11:46 am

Chandrababu

Follow us on

Chandrababu: టిడిపి కూటమి అధికారంలోకి వస్తే మంత్రివర్గ కూర్పు అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఈనెల 13న పోలింగ్ ముగిసింది. ఓటింగ్ పెరగడంతో కూటమికి సానుకూల ఫలితాలు వస్తాయని సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం మూడు పార్టీలకు మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సింహభాగం టిడిపి తీసుకున్నా.. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేనకు కనీసం మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీకి సైతం రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఏడు నుంచి ఎనిమిది మంత్రి పదవులు బయటకు వెళ్తాయి. మరో 17 వరకు మాత్రమే టిడిపికి మిగులుతాయి. మరోవైపు మూడు పార్టీల్లోనూ సీనియర్లు, ఆశావాహులు అధికంగా ఉన్నారు. వారిని సముదాయించి, సర్దుబాటు చేయడం చంద్రబాబుకు అంత ఈజీ కాదు.

జనసేన నుంచి పవన్ తో పాటు చాలామంది సీనియర్లు పోటీ చేశారు. ఆ పార్టీలో రెండో స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి సీనియర్ నేత కొణతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఇక జనసేన నుంచి కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్ వంటి వారు సైతం మంత్రి పదవులు ఆశిస్తున్నారు. జనసేన గెలిచే స్థానాలను బట్టి మంత్రి పదవుల కేటాయింపు ఉంటుంది. పవన్ క్యాబినెట్ లోకి వస్తారా? రారా? అన్నది తెలియాల్సి ఉంది.

భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేశారు. ఆయన గెలుపు పొందితే కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కైకలూరు నుంచి మరో సీనియర్ కామినేని శ్రీనివాస్ పోటీ చేశారు. గతంలో ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. ఈసారి కూడా ఆయన మంత్రి పదవి ఆశిస్తారు. మరోవైపు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు. ఆయన సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అటు రాయలసీమ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో అయితే చెప్పనవసరం లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పదుల సంఖ్యలో సీనియర్లు ఉన్నారు. శ్రీకాకుళం నుంచి అచ్చెనాయుడు, కూన రవికుమార్, విజయనగరం నుంచి కళా వెంకట్రావు, కోండ్రు మురళీమోహన్, విశాఖ నుంచి అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, కృష్ణాజిల్లా నుంచి వసంత కృష్ణ ప్రసాద్, కొలుసు పార్థసారథి, గుంటూరు నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నెల్లూరు నుంచి పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాయలసీమ నుంచి కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, పరిటాల సునీత, జెసి అస్మిత్ రెడ్డి వంటి వారు పదవులు ఆశిస్తున్నారు