AP Cabinet : ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు!

 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు సమీపిస్తోంది. కీలక నిర్ణయాలు తీసుకుంటూ  ముందుకు సాగుతోంది. ఈరోజు క్యాబినెట్ సమావేశంలో సైతం గత ప్రభుత్వ విధానాలపై చర్చించి.. నిర్ణయాలు తీసుకోవడం విశేషం.

Written By: Dharma, Updated On : August 7, 2024 5:33 pm
Follow us on

AP Cabinet : ఏపీ మంత్రి వర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల హామీలకు ప్రాధాన్యం ఇస్తూ.. నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా వైసిపి హయాంలో జరిగిన  వివిధ ప్రభుత్వ పాలసీలపై దృష్టి పెట్టింది. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి గురించి చర్చించింది. అదే సమయంలో మద్యం కొత్త పాలసీ ప్రకటనకు సైతం మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ హయాంలో రెవెన్యూ నిర్ణయాలపై సైతం కీలక నిర్ణయాలు తీసుకుంది. జగన్ ఫోటోలతో  రాళ్లు.. భూముల సర్వే తదితర అంశాలపై చర్చించారు. వాటి స్థానంలో ప్రభుత్వము ముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మావోయిస్టులపై నిషేధం కొనసాగించడానికి నిర్ణయించారు. అన్నిటికంటే ముఖ్యంగా స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత నిబంధనను పక్కన పెట్టారు. అందుకు సంబంధించి క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవకతవకలపై క్యాబినెట్ బేటిలో చర్చ జరిగింది. ఇటీవలే మద్యం కొత్త పాలసీని ప్రకటించనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు క్యాబినెట్లో పాత ఎక్సైజ్ పాలసీని పక్కనపెట్టి.. కొత్త పాలసీని రూపొందించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో మార్పులు తేవాలని కూడా క్యాబినెట్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి స్పష్టమైన సూచన చేసింది.
 * 217 జీవో రద్దు 
 మత్స్యకారుల జీవన విధానానికి విఘాతం కలిగిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన 217 జీవో రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో చేపల వేటకు సంబంధించి ఇచ్చిన ఈ జీవోను మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రస్థాయిలో ఉద్యమాలు చేశారు. జనసేన అయితే మత్స్యకార గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను సైతం రూపొందించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. టిడిపి సైతం  ఇదే తరహా హామీ ఇచ్చింది. హామీ మేరకు జీవోను రద్దు చేసింది.
* బొమ్మ, పేరు తొలగింపు 
 భూముల సర్వే పేరుతో జగన్ బొమ్మతో రాళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రీసర్వే ప్రక్రియ పై సైతం చర్చించింది. బొమ్మల పిచ్చితో వైసీపీ సర్కారు 700 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిందని అభిప్రాయపడింది మంత్రివర్గం.అందుకే ఈ సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాజముద్రతో ఉన్న కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీకి కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
 * ఎన్నికల హామీలకు ప్రాధాన్యం
 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా.. క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో భాగంగా కూటమిపరంగా, టిడిపి, జనసేన వేర్వేరుగా చాలా రకాల హామీలు ఇచ్చాయి. ఇప్పుడు వాటిని అమలు చేసే విధంగా క్యాబినెట్లోనిర్ణయాలు తీసుకోవడం విశేషం. అయితే అన్నింటికీ మించి స్థానిక ఎన్నికల్లో.. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులన్న నిబంధన తొలగించడం విశేషం. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.