Nagababu: నాగబాబు ( Nagababu ) రాజ్యసభకు వెళ్తారా? జనసేన నుంచి ప్రతిపాదన వచ్చిందా? చంద్రబాబు ఆమోదించారా? విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల కిందట నాగబాబును ఏపీ క్యాబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ని చేసి మంత్రి చేస్తారని అంతా భావించారు. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో నాగబాబుకు ఒక పదవి ఖాయమని ప్రచారం సాగింది. తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని కూడా టాక్ నడిచింది. అయితే చివరి నిమిషంలో సీన్ మారింది. జనసేన విన్నపం మేరకు నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. ఒకే ఇంట్లో ఇద్దరు క్యాబినెట్లో ఉంటే ఇబ్బంది కరం అని భావించి పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Also Read: ఫాఫం.. పోసానిని తిప్పిన చోట తిప్పకుండా తిప్పుతున్నారే?
* అప్పట్లో ప్రకటన
కొద్ది రోజుల కిందట మూడు రాజ్యసభ స్థానాలను( Rajyasabha seats ) భర్తీ చేసిన సంగతి తెలిసిందే. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, కృష్ణయ్య రాజీనామాలతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ సమయంలో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తారని చివరి వరకు ప్రచారం సాగింది. అయితే సమీకరణల్లో భాగంగా ఆయనకు ఇవ్వడం కుదరలేదు. ఆ సమయంలోనే సీఎం చంద్రబాబు నాగబాబును రాష్ట్ర క్యాబినెట్ లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఒకేసారి 5 ఎమ్మెల్సీ పదవులు రావడంతో.. అవి కూటమికే దక్కనుండడంతో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ జనసేన వ్యూహం మార్చింది.
* ఎంపిక షురూ..
ప్రస్తుతం 5 ఎమ్మెల్సీలకు సంబంధించి పేర్లు ఖరారు చేయడంలో చంద్రబాబు( CM Chandrababu) బిజీగా ఉన్నారు. ఒకవేళ రాజ్యసభకు నాగబాబు వెళితే.. జనసేనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం లేదు. బిజెపికి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానం బిజెపికి కేటాయిస్తారని ఇప్పటివరకు ప్రచారం జరుగుతూ వచ్చింది. నాగబాబు కోసం బిజెపి ఆ పదవి వదులుకుంది కాబట్టి.. ఎమ్మెల్సీ పదవిని బిజెపికి ఇచ్చి సంతృప్తి పరుస్తారని తెలుస్తోంది. జనసేనలో నాగబాబు యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఆయన క్యాబినెట్ లోకి వస్తే ఇద్దరు అన్నదమ్ములు పదవులు తీసుకున్నారని ప్రత్యర్థులు ప్రచారం చేసే అవకాశం ఉంది. అందుకే నిర్ణయం మారినట్లు సమాచారం.
* ఢిల్లీకి చంద్రబాబు..
ఈరోజు చంద్రబాబు ఢిల్లీ( Delhi ) వెళ్ళనున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ సమయంలో నాగబాబు ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. రాజ్యసభకు పంపితే బాగుంటుందన్న ఆలోచన పవన్ చేసినట్లు సమాచారం. అందుకే చంద్రబాబు సైతం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలకు ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పనున్నారట. రాజ్యసభ నాగబాబుకి విడిచిపెడితే ఎమ్మెల్సీ పదవి బిజెపికి కేటాయిస్తామని చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు చెప్పనున్నారు. మొత్తానికైతే నాగబాబు రాజ్యసభకు వెళ్లడం ఖాయమని తేలుతోంది.
Also Read: ప్రమాదంలో వైయస్సార్ కాంగ్రెస్.. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అదే!