N.G. Ranga Agricultural University : తెలుగు రాష్ట్రాల్లోనే కీలకమైన ఎన్.జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు రెడీ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో దీని సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే వ్యవసాయంలో ఎన్నో కొత్త వంగడాలు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా వర్సిటీ గుర్తింపు తెచ్చుకుంది. కొత్త కొత్త ఆవిష్కరణలతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో వినూత్న మార్పులతో ఎన్.జీ రంగా విశ్వవిద్యాలయం పేరు తెచ్చుకుంది. తాజాగా ఏపీలోనూ ఈ వర్సిటీ విస్తరణ బాటపట్టింది.

ఏపీ సీఎం జగన్ చొరవతో ఆయన సొంత ఇలాకా వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ‘గవర్నమెంట్ వ్యవసాయ కళాశాల’ను ఎన్.జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మంజూరు చేసింది. ఈ కళాశాల 2023-24 విద్యా సంవత్సరంలో పలు కోర్సులతో ప్రారంభించడానికి సిద్ధమైంది.
2023-24 విద్యా సంవత్సరంలో బీఎస్సీ (హానర్స్), అగ్రికల్చర్ (B.Sc (Hons) Agriculture) లో అరవై మంది (60) విద్యార్థులతో పనిచేయడం ప్రారంభం జరుగుతుందని.. దీనికిగాను 104 (48 బోధన సిబ్బంది + 56 బోధనేతర సిబ్బంది) పోస్టులను వ్యవసాయ మరియు సహకార మంత్రిత్వ శాఖ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగినదని గౌరవ ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఏపీ సీఎం జగన్ తన సొంత ఇలాకా ప్రజలు, జిల్లా విద్యార్థుల కోసం స్వయంగా ముందుకొచ్చారు. ఎన్.జీ రంగా వర్సిటీతో కలిసి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను పులివెందులలో ఏర్పాటు చేశారు. దీనికి కాను ఈ సంవత్సరమే 60 మంది విద్యార్థులు 104 మంది సిబ్బందితో మొదలుపెడుతున్నారు. జగన్, ఎన్.జీ రంగా వర్సిటీలతో చొరవతో విద్యార్థుల కల నెరవేరనుంది.