New Ration Cards
New Ration Cards: ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతుండడంతో సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. మే నెల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. అయితే సంక్షేమానికి రేషన్ కార్డులు ప్రామాణికం కావడంతో ముందుగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తోంది. అయితే అంతకంటే ముందే అనర్హుల రేషన్ కార్డులు తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యాచరణ ప్రారంభం అయ్యింది. సచివాలయం ఉద్యోగులతో పాటు రేషన్ డిపోల వద్ద ఈ కేవైసీ ప్రక్రియ చేపడుతోంది. కార్డు లబ్ధిదారులంతా ఈ కేవైసీ చేసుకోవడం తప్పనిసరి చేసింది. తద్వారా బినామీ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం అయ్యింది.
Also Read: దక్షిణాది భాషలపై పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్!
* పెద్ద ఎత్తున అనర్హులకు పింఛన్లు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అనర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో చాలామంది అర్హులు ఇంకా రేషన్ కార్డులు పొందలేదు. గత కొన్నేళ్లుగా ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరగలేదు. లక్షలాదిమంది దరఖాస్తుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఓ మూడు లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో కొత్త కార్డుల పంపిణీకి ముందే.. వీలైనంత త్వరగా అనర్హుల కార్డులను ఏరివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి రకరకాల ప్రామాణికాలను తీసుకుంటోంది. ముఖ్యంగా ఈ కేవైసీ తప్పనిసరి చేయడంతో వీలైనంతవరకు అనర్హుల కార్డుల ఏరివేత ఒక కొలిక్కి వస్తుందని భావిస్తోంది ప్రభుత్వం.
* 31 లోగా ఈ కేవైసీ
ఈనెల 31లోగా రేషన్ కార్డులకు( ration cards ) పూర్తిస్థాయిలో ఈ కేవైసీ పూర్తి చేయాలని అన్ని జిల్లాల యంత్రాంగాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని గ్రామాల్లో రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు 30 శాతం మంది రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ పూర్తి చేయనట్టు తెలుస్తోంది. అయితే ఎక్కడ రేషన్ కార్డులు రద్దవుతాయని భావించి చాలామంది ముందుకు వస్తున్నారు. అయితే అనర్హులుగా భావిస్తున్న చాలామంది కార్డుదారులు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియతో బినామీ కార్డులకు సంబంధించి ఒక అంచనా రానుంది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం అడుగులు వేయనుంది.
* పథకాలకు కార్డులే ప్రామాణికం..
మే నెల నుంచి సంక్షేమ పథకాలు( welfare schemes) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సూపర్ సిక్స్ పథకాలపై ఫోకస్ పెట్టింది. వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంకో వైపు విద్యా సంవత్సరం ప్రారంభంలో తల్లికి వందనం అమలు చేయాలని చూస్తోంది. వీటన్నింటికీ ప్రామాణికం రేషన్ కార్డు కావడంతో చాలామంది లబ్ధిదారుల్లో ఆందోళన ఉంది. అందుకే ముందుగా అనర్హుల రేషన్ కార్డులు తొలగించి.. కొత్తవారికి లైన్ క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికైతే ఈ కేవైసీ పుణ్యమా అని రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చినట్లు అయింది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా అనర్హత కార్డులు ఉన్నట్లు ఒక అంచనా ఉంది. పైగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటిపై ఈ నెల చివర్లో ఒక స్పష్టత రానుంది.