New District : ఏపీలో కొత్త జిల్లాల( new districts ) ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యేక జిల్లాకు సంబంధించి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో జిల్లాల పునర్విభజన పై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. అదే జరిగితే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఆవిర్భావం ఖాయం. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. అప్పట్లో విభజన హేతుబద్ధంగా జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే సరి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు కొత్త జిల్లాల ఆలోచన చేస్తున్నారు.
* మంత్రివర్గంలో చర్చ
మంత్రివర్గ సమావేశం( Cabinet meeting ) మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా జిల్లాల విభజనపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లాల పునర్విభజనపై టిడిపి కూటమి హామీలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ హామీలపై నివేదిక ఇవ్వాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. కూటమి పార్టీల నేతలతో పాటుగా వివిధ సంఘాల వారిని భాగస్వామ్యులను చేసి జిల్లాల పునర్విభజనపై తాము ఇచ్చిన హామీల గురించి నివేదిక రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Also Read : కొత్త జిల్లాలకు కేంద్రం పర్మిషన్.. జిల్లాలకు కోడ్ లు మంజూరు..
* ఎన్నికల్లో చంద్రబాబు హామీ..
ప్రధానంగా మార్కాపురం( Markapuram) కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అప్పట్లో ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆ మేరకు హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు మార్కాపురం ప్రత్యేక జిల్లా హామీలు అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. మరోవైపు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు. మార్కాపురం ప్రకాశం జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణం. రెవిన్యూ డివిజన్ గా కూడా కొనసాగుతోంది. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటు అయిన నాటి నుంచి మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది.
* పరిగణలోకి తీసుకోని వైసిపి
జిల్లాల పునర్విభజన చేపట్టిన వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం మార్కాపురం జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. దీనిపై ఆ ప్రాంత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దానిని గుర్తించిన టిడిపి అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే మార్కాపురం జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పురపాలక శాఖ మంత్రి నారాయణ దీనిపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా కేంద్రం ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అతి త్వరలోనే మార్కాపురం జిల్లా ఏర్పాటు ఖాయమని తెలుస్తోంది. మరి మున్ముందు పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.