Nara Lokesh News: ఏపీ మంత్రి నారా లోకేష్ రాజకీయంగా ఎదుగుతున్నారు. పాలనలో తనదైన ముద్ర చాటుకుంటున్నారు. ఆపై తెలుగుదేశం పార్టీని నడపడంలో కూడా ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా, చంద్రబాబు వారసుడిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు విపరీతమైన నమ్మకం పెట్టుకున్నాయి. అయితే ఈ క్రమంలో లోకేష్ చుట్టూ ఒక రకమైన విషవలయం చుట్టుకుంటుంది. ఆయనపై వ్యతిరేక ప్రచారానికి ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీ నేతలే అవకాశం కల్పిస్తున్నారు. దేశంలో ఏ యువనేతకు జరగని వ్యతిరేక ప్రచారం లోకేష్ పై జరిగింది. దాని నుంచి అధిగమిస్తూ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు లోకేష్.. అయితే ఇప్పుడు టిడిపి శ్రేణుల విపరీతమైన నమ్మకంతో వారి నుంచే లోకేష్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆపై రాజకీయపరమైన గోబెల్స్ ప్రచారానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది కూడా.
టిడిపి నేత వింత సమాధానం..
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో నేషనల్ మీడియా సంస్థ ఒకటి డిబేట్ నిర్వహించింది. దీనికి టిడిపి తరఫున ఒక ప్రతినిధిని ఆహ్వానించారు. టిడిపి తరఫున ఎంపీగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ డిబేట్ నిర్వాహకుడిగా ఆర్నాబ్ గోస్వామి ఉన్నారు. ఈ క్రమంలో విమాన సంక్షోభం పై ఆయన ప్రశ్నించేసరికి టిడిపి ప్రతినిధిగా హాజరైన దీపక్ రెడ్డి వింత సమాధానం చెప్పారు. నారా లోకేష్ ఈ సమస్యపై దృష్టి పెట్టారని.. వార్ రూమ్ ఏర్పాటు చేసి దీనిపైనే చర్చిస్తున్నారని చెప్పడంతో.. ఆర్ణబ్ గోస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కదా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అది మొదలు కింజరాపు రామ్మోహన్ నాయుడును డమ్మీ చూస్తూ లోకేష్ అన్ని చక్కబెడుతున్నారని.. ఏపీలో ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మారిపోయారని విమర్శలు మొదలుపెట్టారు కొందరు విశ్లేషకులు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల విశ్లేషణలు చేసే చాలామంది ఇదే అభిప్రాయాన్ని పదును పెట్టి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు.
కొత్త ఆరోపణలు..
లోకేష్ విషయంలో ఒక ప్రచారం అయితే మాత్రం జరుగుతోంది. అచ్చం ఆయన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిలా వ్యవహరిస్తున్నారు అంటూ కొత్త ఆరోపణలు మొదలయ్యాయి. ప్రత్యర్థులను కేసులతో వేధించడంతోపాటు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జగన్ మనస్తత్వానికి దగ్గరగా లోకేష్ ఉన్నారంటూ చాలామంది ఎద్దేవా చేయడం ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నత స్థాయిలో ఉండే అవినీతి సైతం ఇప్పుడు కొనసాగుతుందని అర్థం వచ్చేలా మాట్లాడిన వారు ఉన్నారు. అయితే దీనికి విపరీతమైన అభిమానం, లోకేష్ దృష్టిలో పడాలన్న తపన, తమ భావి నాయకుడు లోకేష్ అని చూపించడంలో అత్యుత్సాహం వంటి కారణాలతో ఇప్పుడు టిడిపి యువ నేత కార్నర్ అవుతున్నారు. ఈ విషయంలో కట్టడిగా ముందుకు సాగకపోతే లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది తెచ్చి పెట్టినవారు అవుతారు.