Jagan: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. ప్రభుత్వానికి దాదాపు 56 నెలల గడువు ఉంది. అయితే కేంద్రం మాత్రం జమిలీలో భాగంగా ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు చేస్తోంది. కేంద్రంలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, జనసేన దీనిని ఆహ్వానించాయి. వైసీపీ సైతం జై కొట్టింది. అయితే రాష్ట్ర అవసరాల దృష్ట్యా కూటమి మరో పదేళ్లపాటు కొనసాగాలని చంద్రబాబుతో పాటు పవన్ ఆకాంక్షిస్తున్నారు. హర్యానాలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి చంద్రబాబుతో పాటు పవన్ హాజరయ్యారు. అటు నుంచి వచ్చిన వెంటనే చంద్రబాబు కీలక ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఆ రెండు పార్టీల శ్రేణులతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. అదే సమయంలో పవన్ చర్యలు సైతం అలానే ఉన్నాయి. పవన్ సైతం మూడు పార్టీలు పొత్తు కొనసాగాలని బలంగా భావిస్తున్నారు. దీంతో ఎన్డీఏ కూటమి వచ్చే ఎన్నికల నాటికి కొనసాగుతుందని అర్థమయింది. ఈ తరుణంలో జగన్ పరిస్థితి ఏంటి? ఇండియా కూటమిలో చేరతారా? కాంగ్రెస్ తో జత కడతారా? వామపక్షాలతో స్నేహం చేస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసిపి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా కూటమితో జత కట్టడమే మేలన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఇండియా కూటమి బలహీనంగా ఉంది. కానీ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీతో కాంగ్రెస్,వామపక్షాలు జత కడితే మాత్రం వైసిపి వాయిస్ పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలపై సమిష్టిగా పోరాడితే మంచి ఫలితం ఉంటుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
* వామపక్షాలకు ఆ బలం
రెండు దశాబ్దాలుగా వామపక్షాలు ఏపీలో ఉనికి కోల్పోయాయి. అయితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మాత్రం వామపక్షాల మద్దతు ఎవరికి ఉంటే వారికే.. రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది. గత మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో టిడిపి అభ్యర్థులను ప్రకటించింది. అదే సమయంలో వామపక్షాలు సైతం తమ మద్దతుదారులను బరిలో దించాయి. అయితే అప్పుడు పాలకపక్షంగా వైసీపీ ఉంది. వైసీపీకి వామపక్షాలు వ్యతిరేకంగా ఉండేవి. అయితే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్న ఉద్దేశంతో… అప్పట్లో రెండో ప్రాధాన్యత ఓటును టిడిపి అభ్యర్థికి వేశారు వామపక్షాల క్యాడర్. దాని ఫలితంగానే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అప్పటినుంచి వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. అంటే వామపక్షాలు నేరుగా గెలవలేవు. కానీ బలమైన పార్టీతో అవి జత కలిస్తే మాత్రం.. వారి బలాన్ని ఆపలేం అనే విషయాన్ని గుర్తించాలి.
* కాంగ్రెస్ బలపడితే జగన్ కి నష్టం
కాంగ్రెస్ పార్టీ ఏపీలో సర్వనాశనం అయ్యింది. అయితే కాంగ్రెస్ పార్టీ బలపడితే మాత్రం వైసిపి బలహీనం అవుతుంది. ఎందుకంటే వైసీపీ క్యాడర్ ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆదరణ తగ్గడం వల్ల.. ప్రత్యామ్నాయం లేక ఎక్కువమంది వైసీపీ వైపు చూశారు. కానీ వైసిపి భారీ ఓటమి చవి చూడడంతో.. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తేలడంతో ఎక్కువమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి వైసీపీకి దెబ్బ తగిలింది. అదే సమయంలో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం అదే స్థాయి వ్యతిరేకత తీసుకొచ్చింది. సో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తన వైపు తీసుకు రాకపోతే జగన్ కు ఇబ్బందికరమే. అందుకే జగన్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ జగన్ ఇండియా కూటమిలో చేరితే.. ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశం ఉంది. వైసిపి వాయిస్ గా వామపక్షాలతో పాటు కాంగ్రెస్ మారే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏపీలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య హోరాహోరీ ఫైట్ నడవనుందన్నమాట.