Rajya Sabha Election : ఏపీలో రాజ్యసభ సందడి ప్రారంభం అయ్యింది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. కచ్చితంగా కూటమి అభ్యర్థులే గెలవనుండడంతో మూడు పార్టీల్లో సందడి ప్రారంభమైంది. వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలుపదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. కృష్ణయ్య మాత్రం బిజెపిలో చేరతారని ప్రచారం సాగుతోంది. వైసిపి రాజ్యసభ సభ్యుడు మరొకరు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తం 11 మంది సభ్యులకు గాను ఇప్పటికే ముగ్గురు దూరమయ్యారు. దీంతో వైసిపి బలం ఎనిమిదికి పడిపోయింది. మరొకరు పార్టీకి రాజీనామా చేస్తారని తెలుస్తుండడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అయితే ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. మూడు స్థానాలు కూటమికి దక్కనున్నాయి. దీంతో చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ముందుగా రెండు టిడిపికి, ఒకటి జనసేనకు ఇవ్వాలని భావించారు. కానీ బిజెపి సైతం వాటా అడుగుతున్నట్లు తెలుస్తోంది. మూడు పార్టీలు ఒక్కో సీటు ఖరారు దిశగా నిర్ణయం జరిగినట్లు సమాచారం. అటు అభ్యర్థుల ఖరారు దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు కూడా తెలుస్తోంది.
* నాగబాబు పేరు ఖాయం
అయితే ఈసారి నందమూరి, కొణిజేటి కుటుంబాలకు రాజ్యసభ పదవులు ఖాయమని తెలుస్తోంది. జనసేన తరపున మెగా బ్రదర్ నాగబాబు పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. కూటమి గెలిచిన వెంటనే టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నాగబాబును నియమిస్తారని తెగ ప్రచారం నడిచింది. కానీ అందుకు నాగబాబు సుముఖత వ్యక్తం చేయలేదని.. రాజ్యసభ పదవి కోరుకుంటున్నారని.. ఎంపీ అయ్యి కేంద్రమంత్రిగా పదవి చేపట్టాలని నాగబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఏదైనా భారీ పరిణామం జరిగితే కానీ.. నాగబాబు మార్పు అనివార్యమని సమాచారం. దాదాపు జనసేన పార్టీ నాగబాబు అభ్యర్థిత్వాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే మెగాస్టార్ కుటుంబంలో ముగ్గురు సోదరులు పదవులు చేపట్టినట్టే. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో.. చిరంజీవి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో సైతం స్థానం దక్కించుకున్నారు. తాజా ఎన్నికల్లో పవన్ సంపూర్ణ విజయం సాధించారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. నాగబాబు ఎంపీ అయితే.. జనసేన కోటాలో కేంద్ర మంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
* నందమూరి సుహాసిని కి ఆఫర్
అయితే ఈసారి తెలుగుదేశం పార్టీకి లభించే రాజ్యసభ స్థానాన్ని నందమూరి కుటుంబ సభ్యులకు కేటాయిస్తారని తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో తెలంగాణలో ఆమె సేవలను వినియోగించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ బలహీనంగా ఉంది. నందమూరి సుహాసిని కి రాజ్యసభకు పంపించి తెలంగాణ బాధ్యతలు అప్పగించడానికి చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా నందమూరి కుటుంబం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హరికృష్ణ వారసులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు కుటుంబానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని సమయాల్లో వారు బాగానే స్పందిస్తున్నారు. మంచి సంబంధాలే ఉన్నాయని తెలుస్తోంది. అయితే అనవసర ప్రచారానికి చెప్పాలంటే నందమూరి కుటుంబానికి ఒక పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన చంద్రబాబు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే నందమూరి, కొణిదల కుటుంబాలకు పదవులు ఖాయం అయినట్టేనన్న మాట.