Chandrababu : అటల్ బిహారీ వాజ్ పేయ్ ను నేనే ప్రధాని చేశాను. డాక్డర్ అబ్దుల్ కలాంను నేనే రాష్ట్రపతిని చేశాను…ఇటువంటి మాటలు ఎవరి నోటి వెంబడి వస్తాయో అందరికీ తెలిసిన విషయమే. దీ మోస్ట్ సీనియర్ లీడర్ చంద్రబాబు నోరు తెరిస్తే ఈ మాటలే చెబుతుంటారు. అందులో వాస్తవం ఉన్నా.. అవన్నీ కాలం చెల్లిన మాటలు. వాటికి పెద్దగా వాల్యూ ఉండదు సరికదా.. పదే పదే అవే మాటలు చెబితే సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవే సంక్లిష్టం చేస్తాయి. ఇప్పుడు చంద్రబాబు ఎదుర్కొంటున్న పరిస్థితి అటువంటిదే. ఎన్డీఏలోకి ఎంట్రీ లేదు. విపక్ష కూటమిలో ప్రవేశం అంతకంటే కష్టంగా మారింది.
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఉంది చంద్రబాబు పరిస్థితి. కలవాలనుకుంటున్న ఎన్డీఏ పట్టించుకోవడం లేదు. విపక్ష కూటమి వైపు వెళదామంటే వీలు కుదరని పరిస్థితి. ఏం చేయాలో తెలియని అగమ్యగోచర స్థితి ఆయనది. ఎన్డీఏలో సుదీర్ఘ కాలం పనిచేసినా..కూటమికి కన్వీనర్ గా ఉన్నా మోదీ చంద్రబాబును పరిగణలోకి తీసుకోలేదు. పవన్ ను పిలిచి చంద్రబాబును దారుణంగా అవమానించారు. చంద్రబాబు అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు.
గత ఎన్నికల ముందు జరిగిన పరిణామాలతో ఎంతలా మూల్యం చెల్లించుకున్నారో చంద్రబాబుకు తెలుసు. నాడు మోదీ మరోసారి అధికారంలోకి రాకుండా చేసేందుకు కాలికి బలపం కట్టుకొని దేశమంతా చంద్రబాబు తిరిగారు. అనుకున్నది సాధించకపోగా.. తానూ నెగ్గలేకపోయారు. తనకు అధికారం దూరం చేసిన కాషాయదళంపై పట్టలేనంత కోపం ఉన్నా..గత పరిణామాలు గుర్తుకొచ్చి జాగ్రత్తగా ఉంటున్నారు. గతంలో తనతో పనిచేసిన మమతా బెనర్జీ, నితీష్ కుమార్ వంటి నేతలతో విపక్షం పరిపుష్టిగా కనిపిస్తున్నా వారి దగ్గరకు చేరుకోలేని స్థితి. అదే జరిగితే పవన్ తన వెంట రారు సరికదా.. కేంద్ర ప్రభుత్వం ఎన్నివిధాలా ఇబ్బందులు పెడుతుందో చంద్రబాబుకు తెలుసు.
అయితే ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న చంద్రబాబుకు తాజా పరిణామాలు మింగుడు పడడం లేదు. నాటి పెద్దన్న పాత్ర గుర్తుకు చేసుకొని మురిసిపోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఆయన్ను ప్రధాని చేశాను.. ఈయన్ను రాష్ట్రపతి చేశాను అన్న సంతృప్తి పడడమే తప్ప ఇప్పుడు తరుణోపాయం తెలియదు. ఇష్టం లేని పార్టీ బీజేపీ వైపువెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఆయనది. ఇష్టమైన విపక్ష కూటమి వైపు వెళ్లలేని దుస్థితి. దీంతో కక్కలేక.. మింగలేక చంద్రబాబు నానా హైరానా పడుతున్నారు. అడుగు ముందుకు వేయలేకపోతున్నారు.