Narasaraopet: వైద్యులు దేవుళ్ళతో సమానం.. ఎందుకంటే దేవుడు మనకు జన్మనిస్తే.. ఆపద కాలంలో వైద్యులు మనకు పునర్జన్మ ప్రసాదిస్తారు. అయితే దేవుళ్ళతో సమానమైన వైద్యులు కొన్ని సందర్భాలలో చేసే తప్పులు ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. అటువంటిదే ఈ సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలనాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఈ ఘోరం జరిగింది.
నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకోవడానికి బాలయ్య నగర్ ప్రాంతానికి చెందిన రమాదేవి వచ్చింది. ఇక్కడి ఆసుపత్రికి గత నెల 24న ఆ మహిళ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకోవడానికి వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అదే నెల 26న ఆసుపత్రికి వస్తే శస్త్ర చికిత్స చేస్తామని చెప్పారు. ఆస్పత్రి వైద్యులు డాక్టర్ నారాయణస్వామి రమాదేవికి శస్త్ర చికిత్స చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. శస్త్ర చికిత్స చేసే సమయంలో రమాదేవికి అనస్తీసియా ఇంజక్షన్ సరిగా ఇవ్వలేదు. అంతేకాదు సర్జరీ సమయంలో ఉపయోగించే పరికరాల ప్లేట్ ఆమె తొడ మీద ఉంచారు. అంతేకాదు ఒక పదునైన కత్తెర లాంటి వస్తువు ఆమెకు గుచ్చుకున్నట్టయింది. ఆ సమయంలో ఆమె నొప్పిగా ఉందని చెబుతున్నప్పటికీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ఆమెను చెంపల మీద కొట్టారు. అదేరోజు సాయంత్రం ఆమెను డిస్చార్జ్ చేశారు.
శుక్రవారం విపరీతంగా నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు రమాదేవిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఎక్స్ రే తీయడంతో తొడ భాగంలో సర్జికల్ బ్లేడ్ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఫలితంగా ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేసి బ్లేడ్ తొలగిస్తామని చెప్పారు. అయితే కుటుంబ సభ్యులకు నమ్మకం కుదరకపోవడంతో వారు ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే ఈ ఘటనపై నారాయణస్వామి మరో విధంగా మాట్లాడుతున్నారు. తాను శస్త్ర చికిత్స సక్రమంగా చేశానని చెప్పారు. అయితే శుభ్రం చేయాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన జరిగిందని ఆయన పేర్కొన్నాడు. ట్యూబెక్టమీ చేస్తే బ్లేడ్ తొడ భాగంలోకి వెళ్లే అవకాశం లేదని అతడు స్పష్టం చేశాడు.
ఈ ఘటన పై ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన సిబ్బందిపై వేటువేయాలని సూచించారు. చికిత్స సమయంలోనే ఆ మహిళ తొడ భాగంలో బ్లేడ్ గుచ్చుకున్నట్టు తెలిసింది. అయితే ఈ ఘటనలో తనకు సంబంధం లేదని వైద్యుడు విచారణ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.. అయితే ఆమె తొడ భాగంలోకి బ్లేడ్ ఎలా వెళ్ళిందనే దానిపై తమకు అనుమానాలు ఉన్నాయని.. దీనిపై ప్రత్యేక సిబ్బందితో ఎంక్వయిరీ చేస్తామని విచరణ అధికారుల బృందం ప్రకటించింది. తదుపరి చర్యలు విచారణ అనంతరం తీసుకుంటామని వెన్నడించింది. ఈ ఘటనలో ఇప్పటికి వైద్యుడు నారాయణస్వామి, ఐదుగురు సిబ్బందిపై వైద్యశాఖ వేటువేసింది.