Nara Lokesh new strategy: మంత్రి నారా లోకేష్( Nara Lokesh) రూటు మార్చారు. సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా తరచూ కేంద్ర పెద్దలతో కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బాధ్యతలను మొత్తం నారా లోకేష్ చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంలో సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ తో పాటు ఐటీ శాఖ మంత్రిగా కూడా లోకేష్ ఉన్నారు. ఈ ఈ నేపథ్యంలో ఏపీకి భారీగా ఐటి దిగ్గజ సంస్థలు వస్తున్నాయి. టిసిఎస్ తో పాటు గూగుల్ వంటి మేటి సంస్థలు ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించునున్నాయి. స్వయంగా ఈ విషయాన్ని సదరు సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. గత ఏడాది కాలంలోనే ఇలా పరిశ్రమలు వస్తుండడంతో జాతీయస్థాయిలో సైతం ఏపీ చర్చకు వస్తోంది. మరోవైపు ఇటీవల సీఎం చంద్రబాబు సింగపూర్ లో పర్యటించారు. ఆ బృందంలో మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం నారా లోకేష్ కు ప్రత్యేకంగా ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి లోకేష్ కు ఆహ్వానం అందింది. గతంలో అదే ఆస్ట్రేలియా ప్రభుత్వం గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీని సైతం ఆహ్వానించింది. అయితే ఈ పరిణామాల క్రమంలో నారా లోకేష్ రేపు ప్రధాని మోదీని కలుస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గత నెలలో కుటుంబ సమేతంగా..
ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు ఏపీకి వచ్చారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన శంకుస్థాపనలు కూడా చేశారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ కు సైతం శంకుస్థాపన చేశారు. అయితే రాష్ట్రానికి వచ్చిన ప్రతి క్రమంలో నారా లోకేష్ ను ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందనలు తెలిపారు. కుటుంబంతో సహా ఆహ్వానించారు. ఈ క్రమంలో నారా లోకేష్ గత నెలలోనే కుటుంబంతో కలిసి వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. దాదాపు రెండు గంటలపాటు ఆయనతోనే గడిపి అక్కడే భోజనం చేశారు. ఇప్పుడు మరోసారి ప్రధాని మోదీ వెళ్లనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆ పరిస్థితి రాకుండా..
2018లో ఎన్డీఏ( National democratic Alliance ) నుంచి బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు సైతం బిజెపి పెద్దలకు వ్యతిరేకంగా గళం విప్పారు. కాంగ్రెస్ పార్టీకి స్నేహ హస్తం అందించారు. అప్పుడే 2019 ఎన్నికల్లో ఈ కలయికను ప్రజలు వ్యతిరేకించారు. అందుకే 2019 నుంచి 2024 మధ్య చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. 2023 సెప్టెంబర్లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఆ సమయంలోనే నారా లోకేష్ పరిణితి కనబరిచారు. నేరుగా కేంద్ర పెద్దలను కలిసి సాయాన్ని అర్థించారు. అప్పటినుంచి కేంద్ర పెద్దలతో సఖ్యత గా మెలుగుతూ వచ్చారు. మున్ముందు తెలుగుదేశం పార్టీ ఆ పరిస్థితి ఎదుర్కోకుండా కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగించాలని లోకేష్ భావిస్తున్నారు. మరోవైపు కీలక భాగస్వామి పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున భావి నాయకుడిగా లోకేష్ ప్రమోట్ అవుతున్నారు. అందుకే ఆ బంధాన్ని మరింత దృఢం చేసుకునేందుకు లోకేష్ ను ప్రోత్సహిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గత నెలలో ప్రధాని మోదీని కలిసేటప్పుడు కేవలం వ్యక్తిగత పర్యటనగానే సాగింది. అందుకే ఈసారి రాజకీయంగా కూడా ఈ పర్యటనను ఉపయోగించుకోవాలని లోకేష్ భావిస్తున్నారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా సరికొత్త రాజకీయ వ్యూహాలతో ఢిల్లీలో అడుగు పెడుతున్నట్లు సమాచారం. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.