Nara Lokesh: ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ప్రత్యేకం. ఆయన అనుసరిస్తున్న తీరు కూడా ప్రత్యేకమే. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి పొలిటికల్ వర్గాలతో పాటు సామాన్య జనాల్లో కూడా ఒక్క కొత్త చర్చకు దారితీస్తోంది. ఎటువంటి హంగామా లేకుండా.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయన చేస్తున్న ఆకస్మిక తనిఖీలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ఒక ఎమ్మెల్యే పర్యటన అంటేనే హంగామా ఉంటుంది. ఇక మంత్రి వచ్చారంటే ఆ ఆర్భాటమే వేరు. అధికారుల హడావిడితో పాటు ముందస్తుగా జరిపే కొన్ని రకాల కార్యక్రమాలు కనిపిస్తాయి. కానీ మంత్రి నారా లోకేష్ ఈ సంప్రదాయానికి భిన్నంగా వెళుతున్నారు. ముఖ్యంగా లోకేష్ తీరు సీనియర్ అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమాను తలపిస్తోంది.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీమియర్ షోస్ రివ్యూ…మామూలు రచ్చ కాదుగా..?
* లోకేష్ స్పందన..
ఎన్టీఆర్ జిల్లా (NTR district) మైలవరంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నాసిరకం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆహారాన్ని పిల్లలు డస్ట్ బిన్ లో వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన నారా లోకేష్ క్షమాపణలు కూడా చెప్పారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు. బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నారు. అంతటితో ఆగని లోకేష్ ఆ పాఠశాలను సందర్శించారు. ముందస్తు సమాచారం లేకుండా వెళ్లడం వల్ల క్షేత్రస్థాయిలో అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి. ముందస్తు సమాచారంతో వెళితే అధికారులు అంతా బాగుంది అని మేనేజ్ చేయడం సర్వసాధారణం. దానికి అవకాశం ఇవ్వడం లేదు లోకేష్. ఆకస్మిక తనిఖీలు క్షేత్రస్థాయి యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని పెంచుతాయి అనేది వాస్తవం.
* పాఠశాలల బాట..
మైలవరం ( mylavaram) ఘటన జరిగిన తర్వాత.. మంత్రి నారా లోకేష్ స్పందించిన తర్వాత.. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాఠశాలలను సందర్శిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తున్నారు. విద్యార్థులతో కలిసి సహపంతి భోజనాలు చేస్తున్నారు. వ్యవస్థలో లోటుపాట్లు కనిపించాలి అంటే ఆకస్మిక తనిఖీలు అనేవి జరగాలి. అందుకే వాటిని చేసి చూపిస్తున్నారు నారా లోకేష్. సాధారణంగా లోకేష్ చుట్టూ భజన బృందాలు ఉంటాయి. కానీ ఆయన వారి మాటను నమ్మే స్థితిలో లేరు. అయితే లోకేష్ తన పర్యటనల్లో చూస్తే కార్యకర్తలతో పాటు సామాన్య జనాలతో మమేకం అవుతారు.
అయితే ఎలాంటి లోకేష్ ఎంతలా మారారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. లోకేష్ కొత్త తరహా రాజకీయాలు రాష్ట్రంలో ఒక పాజిటివ్ ట్రెండును సృష్టిస్తున్నాయి. నాయకుడు అనే వాడు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వస్తుంటే అధికార యంత్రాంగంలో కూడా భయం ఉంటుంది. అయితే ఇప్పుడు లోకేష్ బాటలోనే ఇతర ప్రజాప్రతినిధులు నడిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది. అప్పుడే పారదర్శకమైన పాలన కూడా ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది. మరి లోకేష్ చర్యలను మిగతావారు అనుసరిస్తారో లేదో చూడాలి.
