Nara Lokesh satire on Jagan: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకం అయి పని చేయాలి. తప్పదు కూడా. ఎందుకంటే అధికారంలోకి రావాలి కనుక. అయితే అధికారంలో ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు పటిష్ట బందోబస్తు ఉంటుంది. అంచలంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ప్రజలతో కలిసేందుకు వీలుపడదు. కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం భద్రతను పక్కనపెట్టి సామాన్యులతో మమేకం అవుతున్నారు. ప్రతినెల పింఛన్ల పంపిణీ గాను ఒక్కో జిల్లా వెళుతున్నారు. పథకాల ప్రారంభోత్సవ సమయంలో సైతం సామాన్యులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్తున్నా.. పరిమిత సంఖ్యలో మాత్రమే పార్టీ కార్యకర్తలను, నాయకులను కలుస్తున్నారు. అయితే ఇప్పుడు పులివెందులలో విఐపి పాసులు ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం కల్పిస్తున్నారని ఒక ప్రచారం సాగుతోంది. మీడియాలో సైతం కథనాలు వస్తున్నాయి. దీనిపై సెటైరికల్ గా మాట్లాడారు నారా లోకేష్.
పులివెందులలో ప్రజా దర్బార్..
ఈరోజు వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) వర్ధంతి. కుటుంబ సభ్యులతో నివాళులు అర్పించేందుకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి పులివెందుల వచ్చారు. గత రెండు రోజులుగా ప్రజా దర్బార్ నిర్వహించి వినతులు స్వీకరిస్తున్నారు. అయితే ఆయన పులివెందుల పర్యటనలో ప్రజలను కలవడానికి వీఐపీ పాసులు జారీ చేయించారంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ కొత్త సంప్రదాయాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం ఆశ్చర్యపోయారన్నది ఈ వార్తల సారాంశం. అదే సమయంలో చాలామంది భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
పేపర్ క్లిప్పింగులతో ట్వీట్..
అయితే దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్( Nara Lokesh) స్పందించారు. సెటైరికల్ గా ఓ ఫోటోను ట్వీట్ చేశారు. ‘ఓరి నీ పాసుల గాల! సినిమా ఫంక్షన్లకు విఐపి పాసులు విన్నాము గానీ.. సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులు ఏందయ్యా? ఎప్పుడు వినలే..! చూడలే.. వైయస్ జగన్’ అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అయితే లోకేష్ సైతం కడప జిల్లాలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లారు. ఆయన దృష్టికి ఈ విషయం రావడంతోనే.. పేపర్ క్లిప్పింగ్ లతో ట్వీట్ చేశారు.
ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ…. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..! @ysjagan pic.twitter.com/0jGiccnL5A
— Lokesh Nara (@naralokesh) September 2, 2025