NIA Raids: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఐఏ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ ప్రైవేటు ఉద్యోగి ఇంట్లో అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది. నాగులబావి వీధిలోని రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఈ తనిఖీలు చేపట్టారు. అబ్దుల్ తనయుడు సొహైల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఉగ్రవాదులతో లింకులపై ఆరా..
రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అబ్దుల్‌కు ఇద్దరు కుమారులు. బెంగళూరులో నివాసముంటున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ కనిపించకపోవడంతో ఎన్‌ఐఏ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో రాయద్గుంలోని వారి ఇంట్లో రైడ్స్ చేపట్టారు. సోహైల్‌ను అదుపులోకి తీసుకుని ఉగ్రవాదులతో ఉన్న లింకులపై ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే సోదాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవలే కేఫ్‌లో పేలుడు..
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో ఇటీవలే పేలుడు జరిగింది. దీనికి సబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ కొంతమందిని అరెస్టు చేసింది. దీని వెనుక సూత్రధారుల కోసం కూపీ లాగుతోంది. ఈ క్రమంలో అనంతపురంలో దాడులు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు రాయద్గుంలోని సోహైల్‌కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పేలుడు తర్వాత నుంచి అబ్దుల్ కొడుకులు కనిపించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ తనిఖీలపై ఎన్‌ఐఏ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.