Nara Lokesh: వారసత్వ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) వ్యతిరేకం. ఆ పార్టీ విధానం కూడా అదే. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం కాస్త మినహాయింపుగా వ్యవహరిస్తోంది. నారా లోకేష్ విషయంలో ఇది స్పష్టమవుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ యాక్టివ్ గా ఉన్నారు. టిడిపి బాధ్యతలను ఆయనే చూస్తున్నారు. ప్రభుత్వంలోనూ కీలక భాగస్వామిగా ఉన్నారు. మరోవైపు కూటమి పార్టీలతో చక్కటి సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. అయితే ఉన్నట్టుండి నారా లోకేష్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి పిలుపు రావడం మాత్రం తెలుగు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రధాని మోదీని కలిసేందుకు నారా లోకేష్ సతీసమేతంగా ఢిల్లీ బయలుదేరారు. ఈరోజు ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దీంతో వీరి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read: అన్నదాత సుఖీభవ.. అర్హతలివే.. మార్గదర్శకాలు జారీ
* టిడిపిలో పట్టు..
2024 ఎన్నికలకు ముందు నుంచే తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో పట్టు పెంచుకున్నారు నారా లోకేష్. సుదీర్ఘకాలం పాదయాత్ర చేయడం, తండ్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయడం వంటి విషయంలో లోకేష్ దూకుడు తనం కనిపించింది. మరోవైపు 2024 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి లోకేష్ హవా పెరుగుతూ వస్తోంది. మరోవైపు విశాఖలో ప్రధాని మోదీ పర్యటన సమయంలో లోకేష్ తనదైన శైలిలో ప్రసంగించారు. నమో అంటూ మోడీని కొనియాడారు. అమరావతి సభలో అయితే ఒక మిస్సైల్ గా అభివర్ణించారు. లోకేష్ నేర్పరితనం, ఆయన దూకుడు ప్రత్యక్షంగా చూసిన నరేంద్ర మోడీ ముచ్చట పడ్డారు. విశాఖ సభలో భుజం తట్టి ఒకసారి ఢిల్లీ వచ్చి కలవాలని ఆఫర్ ఇచ్చారు. అయితే అప్పట్లో లోకేష్ కలవలేదు. తాజాగా అమరావతి సభకు వచ్చిన ప్రధాని మోదీ మరోసారి లోకేష్ ను సముదాయించారు. ఢిల్లీ వచ్చి కలవాలని గట్టిగానే చెప్పారు.
* హుటాహుటిన ఢిల్లీకి..
అనంతపురం జిల్లా పర్యటనలో ఉండేవారు నారా లోకేష్( Lokesh ). ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో హుటాహుటిన అనంతపురం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి కుటుంబ సమేతంగా ఢిల్లీ బయలుదేరారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఒక ప్రధానమంత్రి ఓ రాష్ట్ర మంత్రితో భేటీ అనేటప్పుడు అనేక రకాల చర్చ నడుస్తుంది. ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెలలోనే టిడిపి మహానాడు జరగనుంది. లోకేష్ కు ప్రమోట్ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. పార్టీ పగ్గాలు లోకేష్ కు అందిస్తారని కూడా టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే లోకేష్ ను ప్రధాని నరేంద్ర మోడీ పిలిచి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* మార్గదర్శకం కోసమేనా..
ఏపీలో ఇప్పటికిప్పుడు బిజెపి బలపడే అవకాశం లేదు. పొత్తులతో ముందుకెళ్తేనే సీట్లతో పాటు ఓట్లు లభిస్తాయి. అందుకే టిడిపి భావి నాయకుడు లోకేష్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) మార్గదర్శకం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు విషయంలో మోడీ వ్యవహార శైలి కూడా మారింది. లోకేష్ విషయంలో చంద్రబాబు విన్నపాన్ని ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తన తరువాత పార్టీతోపాటు కూటమిలో ప్రత్యామ్నాయంగా లోకేష్ ఉంటారని సంకేతాలు ఇచ్చేందుకే.. చంద్రబాబు ఈ భేటీకి ప్లాన్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికైతే ప్రధాని మోదీని లోకేష్ కలుస్తుండడం పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా మారింది.