Amaravati: ‘అమరావతి( Amravati capital ) మునిగిపోతుంది. అసలు రాజధానిగా అక్కడ ఎంపిక చేయడం నిబంధనలకు విరుద్ధం. అది కృష్ణానది వరద ముంపు ప్రాంతం’.. గత కొద్ది రోజులుగా అమరావతి రాజధానిపై జరుగుతున్న ప్రచారం ఇది. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా పక్కన పెట్టింది. దీంతో వేలాది ఎకరాలు భూమిలో ఎటువంటి నిర్వహణ లేక అవి చిట్టడవిలా మారిపోయాయి. కనీసం జంగిల్ క్లియరెన్స్ చేపట్టడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. చివరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 33 కోట్ల రూపాయలతో జంగిల్ క్లియరెన్స్ చేయడంతో.. అమరావతి రాజధాని యధా స్థానానికి వచ్చింది. నిపుణుల సూచనలతో పనులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి అమరావతి పై విషప్రచారం జరుగుతుంది. మళ్లీ ముంపు బారిన పడే అవకాశం ఉందని.. మళ్లీ మళ్లీ నీరు తోడేందుకు కాంట్రాక్టులు పొందనున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం నడుస్తోంది.
Also Read: అన్నదాత సుఖీభవ.. అర్హతలివే.. మార్గదర్శకాలు జారీ!
* ఏకాభిప్రాయంతో..
అమరావతి రాజధాని నిర్మాణం అనేది అందరి అభిప్రాయంతో జరిగింది. అమరావతి ఎంపిక కూడా ఏకాభిప్రాయంతో సాధ్యమైంది. అయితే ఇప్పుడు అమరావతి పై బురదజల్లే ప్రయత్నంలో చాలామంది ఉన్నారు. అయితే వారు ఎవరో ఇట్టే అర్థమయిపోతుంది. కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీ శ్రేణులే. అమరావతి రాజధానిని వ్యతిరేకించింది వారే. వారికి ఇష్టం లేదు కాబట్టే ఈ ప్రచారం చేస్తున్నారన్నది ఒక అభిప్రాయం. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా అది వీలు కాదు. అందుకే ఇలా వ్యతిరేక ప్రచారం చేసి ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారన్నది ఒక భావన. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా ఈ సందేహాలు కూడా వచ్చాయి. అమరావతి ముంపు ప్రాంతం కాకుంటే ఎందుకు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేస్తున్నారని అడిగిన నేతలు కూడా ఉన్నారు.
* నవ నగరాలు నిర్మించాలని ప్లాన్..
అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దాదాపు 40 వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరగనుంది. అయితే ప్రధాన రాజధాని మాత్రం ఓ 9 ఎకరాల్లో నిర్మించనున్నారు. అయితే కృష్ణా నదికి( Krishna river) చెంతనే ఉండడంతో అమరావతి రాజధాని కి భవిష్యత్తులో ముంపు ప్రమాదం ఉందన్నది విపక్షం నుంచి వచ్చిన అభ్యంతరం. అమరావతిలో ముంపు నీరు తరలించేందుకు దాదాపు 1500 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారు. ముంపు లేకపోతే ఎందుకు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇందులో నిజం లేకపోలేదు కానీ.. దేశవ్యాప్తంగా చాలా రాజధానులు నదుల చెంతనే ఉన్నాయి. వరద ముంపులు వస్తున్నాయి. అదే సమయంలో పర్యాటకంగా, ఆహ్లాదకరంగా గణనీయమైన అభివృద్ధి సైతం సాధిస్తూ వస్తున్నాయి.
* వరద నీటి మళ్లింపు చర్యలు..
అమరావతి రాజధానికి కృష్ణానది ముంపు ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత.. జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించిన తర్వాత అమరావతి పరిస్థితి చూస్తే మాత్రం ఎటువంటి వారికైనా అనుమానం కలగక మానదు. కానీ రాజధాని నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటోంది. అందులో భాగంగానే నీటిని మళ్లించేందుకు ఎత్తిపోతల పథకాలను సైతం నిర్మిస్తోంది. ఒక భారీ లక్ష్యం ముందు చిన్న చిన్న ఇబ్బందులు రావడం సహజమని.. అంతమాత్రానికే అభ్యంతరాలు వ్యక్తం చేయడం తగదని నిపుణులు చెబుతున్నారు. అయితే అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులను విడుదల చేసింది. ఆ సమయంలో సైతం అమరావతి రాజధాని ముంపు ప్రాంతమని.. రుణాలు మంజూరు చేయవద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా అమరావతి రాజధాని ముంపు ప్రాంతమని జరుగుతున్న ప్రచారం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. మరి నిజం ఏమిటో వారికే ఎరుక.