Nara Lokesh : తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పండుగ మహానాడుకు సర్వం సిద్ధం అవుతోంది. కడపలో ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు మహానాడు జరగనుంది. చివరి రోజు దాదాపు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీద ఉంది తెలుగుదేశం పార్టీ. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో మహానాడు ను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరినట్టు అవుతోంది. కాగా ఈసారి మహానాడుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చంద్రబాబు 75 వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత నిర్వహిస్తున్న మహానాడు ఇది. అందుకే లోకేష్ భావి నాయకత్వం పై స్పష్టమైన సంకేతాలు పంపాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరో నాలుగు దశాబ్దాలకు తగ్గట్టు దిశా నిర్దేశం చేస్తారని కూడా తెలుస్తోంది. లోకేష్ ను ప్రమోట్ చేయడం ఖాయమని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే వేదికపై టిడిపి సీనియర్లకు చంద్రబాబు ఒక విన్నపం చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read : ప్రధాని చెంతకు లోకేష్.. చంద్రబాబు నయా ప్లాన్!
* సీనియర్లకు విన్నపం..
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు( CM Chandrababu) సమకాలీకులు చాలామంది ఉన్నారు. అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, కళా వెంకట్రావు వంటి చాలామంది నేతలు ఉన్నారు. 2024 ఎన్నికల్లో చాలామంది సీనియర్లు తప్పుకున్నారు. వారి బదులు వారసులు పోటీ చేశారు. అయితే ఇప్పటివరకు టిడిపి సీనియర్లు చంద్రబాబుకు ఎంతో సహకరించారు. చంద్రబాబు నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు సీనియర్ల వారసులు లోకేష్ టీం లో ఉన్నారు. తనకు అందించిన సహకారం.. తన కుమారుడికి సైతం అందించాలని చంద్రబాబు సీనియర్ నేతలను కోరే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు జరిగిన మహానాడులు ఒక లెక్క… ఈసారి జరుగుతున్న మహానాడు మరో లెక్క అన్నట్టు పరిస్థితి ఉంది. కేవలం లోకేష్ ను ప్రమోట్ చేసేందుకు ఈ మహానాడు ను చంద్రబాబు వినియోగించుకుంటారని తెలుస్తోంది.
* ప్రధాని మోదీ ఆశీర్వాదం..
ఇటీవల మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh) కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఎంతో ఉత్సాహంగా లోకేష్ కనిపించగా.. ప్రధాని నరేంద్ర మోడీ సైతం లోకేష్ ను ఆశీర్వదించారు. అయితే లోకేష్ ప్రధానిని కలవడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందన్నది ఒక విశ్లేషణ. మహానాడుకు ముందు.. తెలుగుదేశం పార్టీలో లోకేష్ కు ప్రమోట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. టిడిపి బాధ్యతలు లోకేష్ కు అప్పగిస్తున్న తరుణంలో.. ప్రధానితో ఆశీర్వాదం తీసుకునేందుకు చంద్రబాబు తెరవెనుక వ్యూహం పన్నారు అన్నది ఒక అనుమానం. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తెలుగుదేశం పార్టీకి మంచి గుర్తింపు ఉంది. అటువంటి పార్టీ పగ్గాలు లోకేష్ అందుకుంటున్న తరుణంలోనే.. ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్లారని టాక్ నడుస్తోంది.
* పార్టీలో తిరుగులేని శక్తిగా..
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కు తిరుగులేదు. ఆయన నాయకత్వంపై ఎటువంటి అభ్యంతరాలు లేవు కూడా. నందమూరి కుటుంబం నుంచి కూడా ఆయనకు పోటీ లేదు. దీంతో లోకేష్ పట్టాభిషేకం ఖాయమని తేలిపోయింది. ఈ మహానాడు( mahanadu ) వేదికగా నందమూరి కుటుంబ సభ్యులు సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుటుంబంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు దగ్గుబాటి పురందేశ్వరి రూపంలో లోకేష్ కు ఆశీర్వాదం ఉంది. మరోవైపు చంద్రబాబుకు 75 వసంతాలు పూర్తయ్యాయి. ఇదే కరెక్ట్ సమయమని భావిస్తున్న చంద్రబాబు లోకేష్ పార్టీ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. అయితే అది వర్కింగ్ ప్రెసిడెంట్ పదవా? ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇస్తారా? పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఇస్తారా? అన్నది చూడాలి.
Also Read : అలకలు వద్దు.. అందరూ అలా చేయండి.. నారా లోకేష్ కీలక సూచనలు!