Nara Lokesh: దేశవ్యాప్తంగా ఇప్పుడు ముహూర్తాల టైం నడుస్తోంది. దీంతో పేరు మోసిన పురోహితుల వద్దకు నాయకులు క్యూ కడుతున్నారు. మంచి ముహూర్తాన్ని ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో అంతట ఎలక్షన్ ఫీవర్ నెలకొంది. మొత్తం 7 విడతల్లో ఎలక్షన్ జరుగుతోంది. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే నేతలు సరైన ముహూర్తం చూసి నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. అందుకే పేరు మోసిన పురోహితులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పురోహితులకు గిరాకీ ఏర్పడింది. ఎక్కడ చూసినా నేతల తాకిడి కనిపిస్తోంది. కాగా ఏపీకి సంబంధించి యువనేత నారా లోకేష్ కు తమిళనాడు లోని శ్రీరంగనాథ స్వామి ఆలయ పూజారులు ముహూర్తం పెట్టారు. ఈరోజు ఆయన నామినేషన్లు దాఖలు చేశారు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. అయినా సరే రెండోసారి బరిలో దిగుతున్నారు. దీంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు ముహూర్త బలం చూసుకుని నామినేషన్లు దాఖలు చేశారు. భారీ బలప్రదర్శన నడుమ ఈరోజు మంగళగిరిలో ఆయన నామినేషన్ వేశారు. అటు బిజెపి, జనసేన నేతలు భారీగా తరలివచ్చారు. సర్వమత ప్రార్థనల అనంతరం ర్యాలీగా వెళ్లి లోకేష్ నామినేషన్ దాఖలు చేయడం విశేషం.అయితే మంగళగిరిలో ఎలాగైనా లోకేష్ ను ఓడించాలని జగన్ కసితో పని చేస్తున్నారు. అక్కడ బలమైన చేనేత వర్గం నుంచి మురుగుడు లావణ్య అనే మహిళా నేతను బరిలో దించారు.
తొలిరోజు యువనేత నారా లోకేష్ నామినేషన్లు దాఖలు చేయడం టిడిపి శ్రేణులను ఆకర్షించింది. ఈనెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ఉంది. అయితే తమిళనాడులోని శ్రీరంగనాథ ఆలయ అర్చకులు ఈరోజు లోకేష్ కు అనువైన సమయం కావడంతో ముహూర్తం నిర్ణయించారు. వారి సూచనల మేరకు లోకేష్ తొలి రోజు నామినేషన్లు దాఖలు చేయాల్సి వచ్చింది. అయితే గత కొద్ది రోజులుగా లోకేష్ మంగళగిరి కే పరిమితం అయ్యారు. భాగస్వామ్య పార్టీల సభల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వీలైనంతవరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి.. ప్రచార పర్వంలో అడుగు పెట్టాలని లోకేష్ భావిస్తున్నారు. అందుకే కీలక నేతల్లో ముందుగా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరిలో తొలి విడత ప్రచారం పూర్తి చేసి… రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ప్రచారం చేయాలని లోకేష్ ప్లాన్ చేశారు. అందుకే తొలిరోజు నామినేషన్ దాఖలు చేసినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.